జన్మత అన్నదాతల కుటుంబం అయినా సాధనతో ఉపన్యాసక వృత్తి చేపట్టి ఎందరో విద్యార్థులకు విజ్ఞాన బీజాలు నాటిన కృషీవలురాలు ఆచార్య తేళ్ళ సత్యవతి. ఉపన్యాసకత్వానికే పరిమితం కాకుండా విద్యార్థుల పరిశోధనలో చేయూతనిచ్చిన మార్గదర్శి. అనేక పరిశోధన వ్యాసాలను ప్రామాణికంగా అందించిన పండితమణి, ఎంత ఎదిగినా ఆధార మూలాలను మరవరాదనే 'వృక్ష సూత్రాన్ని' అక్షరాలా పాటించిన ఆదర్శమూర్తి ఆమె. గుంటూరు జిల్లా పాలపర్రులో 'తేళ్ళ సూర్యనారాయణ, మనోహరి దంపతులకు 10 మే 1951న జన్మించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మాస్టర్ డిగ్రీ పొంది 'తెలుగువారి ఇంటి పేర్లు' అంశం మీద నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేటు పొందారు, అనంతరం ఉపన్యాసక వృత్తి చేపట్టి నాగార్జున విశ్వవిద్యాలయంలోనే ఆచార్యురాలుగా ఉద్యోగ విరమణ చేశారు.
మూలాలు వీడని ఈ విద్వత్ మణి సాహితీ ప్రస్థానంలో అవిశ్రాంతంగా చేసిన కృషిలో భాగంగా ఆధునిక తెలుగు సాహిత్యంలో కర్షక జీవనంతో పాటు, 'రైతన్నల నేతన్నల ఆత్మహత్యలు - వచన కవిత్వంలో ప్రతిఫలనాలు' అనే పరిశోధనాత్మక వ్యాసాలతో ఒక విలువైన గ్రంథాన్ని అందించారు.
ప్రతి మనిషికి అత్యంత ముఖ్యమైనవి కూడూ గుడ్డా. ఆ రెండిటిని అందించే రైతన్న నేతన్నల జీవితాలు మాత్రం కడు ద్ణుఖపూరితంగా మారడం.. ఆధునిక సమాజాన్ని పట్టిపీడిస్తున్న దుర్మార్గాల్లో ఒకటి. రైతుల, నేత కార్మికుల ఆత్మహత్యలు, వీరి బలవన్మరణాలకు కారణం పేదరికం మాత్రమే కాదని చారిత్రక ఆధారాలతో ప్రామాణికంగా రచయిత్రి సత్యవతి దీనిలో నిరూపించారు. పూర్వ, ఉత్తర రంగాలుగా విభజించుకున్న ఈ పుస్తకంలో పూర్వ రంగమంతా రైతు నేపథ్యం, ప్రపంచీకరణ ప్రభావం, ఆధునిక వ్యవసాయ రంగంలో రైతుల దుస్థితి, రైతుల ఆత్మహత్యలకు కారణాలు, ప్రభుత్వం పాత్ర, కవుల స్పందనలు, శాస్త్ర విజ్ఞాన ఆవశ్యకతతో పాటు చివరగా అత్యంత అవసరమైన అంశం, రైతుల ఆత్మహత్యలు నివారణ పరిష్కార మార్గాల గురించి చక్కటి విశ్లేషణ చేశారు.
ఉత్తర రంగంలో వస్త్ర నేపథ్యం చెబుతూనే మన తెలుగు పద్య కావ్యాల్లో చేనేతల దుస్థితి, చేనేత కథా పర్వం, చేనేత గుండె కోత, వచన కవిత్వంలో ప్రతిభవించిన నేతన్నల ఆత్మహత్యలు చేనేత రంగం, ఉత్పత్తి వ్యవస్థ, ప్రభుత్వ చర్యలతో పాటు నేతన్నల ఆత్మహత్యలకు పరిష్కారాలు, సూచనలు, సహేతుకంగా తెలపడంలో రచయిత్రిలోని సూక్ష్మ పరిశీలనా గుణం సహేతుక దృష్టి కోణం స్పష్టం అవుతున్నాయి.
చారిత్రిక అంశాలను సైతం సాహిత్య దృష్టితో వెలువరించడం రచయిత్రిలోని సృజనాత్మక భావనకు నిలువుటద్దం, 'వ్యవసాయం చేనేత బంధం'తో ప్రారంభమైన ఈ ప్రామాణిక వ్యాస ప్రస్థానంలో దేశానికి వ్యవసాయ - చేనేత రంగాలు రెండిటినీ రెండు చక్రాలుగా అభివర్ణించారు. గ్రామీణ ప్రాంతాల వికాసంలో కీలక పాత్ర పోషించిన ఈ రెండు రంగాలు కులమతాలకు అతీతంగా జీవనోపాధి కల్పిస్తున్నాయని వెల్లడించారు. వ్యవసాయ, చేనేత రంగాల్లో ప్రపంచీకరణ వల్ల వాటిల్లిన కష్ట నష్టాలను కూలంకషంగా వివరించారు. ఇది క్షేత్ర పర్యటనల, అభిప్రాయాల సమ్మేళన, సమహారంగా సాగించిన అక్షర మధనం. ప్రాచీన సాహిత్యంలో రైతుల ప్రస్తావనలు రైతు ఉద్యమాలు, కథలు, నవలలు, పద్య కావ్యాలు, దీర్ఘ కవితలు, వచన కవితల ఆధారంగా రైతుల జీవన ఔన్నత్యాన్ని అగచాట్లను ఆవిష్కరించారు.
పూర్వం కరువు కాటకాలు తాండవించినా... ఆకలి చావులు ఉన్నాయి తప్ప ఆత్మహత్యలు లేవు. సాంప్రదాయ పంటల స్థానంలో వాణిజ్య పంటలు రావడం, కల్తీ విత్తనాలు మందుల వల్ల వాణిజ్య మోసాలకు నష్టపోయిన ఆధునిక రైతు ఆర్థిక ఇబ్బందులకు లోనై నిస్సహాయ స్థితిలో బలవన్మరణం చెందుతున్నారని నిర్ధారించారు రచయిత్రి. రైతు మరణాలకు నీరు, విద్యుత్, విత్తనాలు, సెజ్‌లు ఎలా కారణమవుతున్నాయో ఆధునిక కవుల కవిత్వాల సాయంగా ఆవిష్కరించారు. వ్యవసాయ రంగంతో పాటు చేనేత రంగం గురించిన చారిత్రక విషయాలు చెబుతూ .. శ్రీకృష్ణదేవరాయల కాలంలో మన చేనేత వైభవం ఎలా ఉందో చెబుతూనే ఇంగ్లాండ్‌లోని పారిశ్రామిక విప్లవం వల్ల ఉత్పత్తి సాధనాల అభివృద్ధి తద్వారా వస్త్ర పరిశ్రమలో చోటు చేసుకున్న వేగం గురించి కూడా వివరించారు.
చేనేత రంగం పట్ల ప్రముఖుల అభిప్రాయాలు ఉదాహరిస్తూ... ఈస్టిండియా కంపెనీ అక్రమ విధానాలు, పాశ్చాత్యుల నిర్బంధ శాసనాల కారణంగా చేనేత పరిశ్రమ క్షీణించిన వైనం, ఆంధ్రలో జరిగిన చేనేత ఉద్యమాలు, సత్యాగ్రహాలు, జాతీయ ఉద్యమంతో సమానంగా సాగిన మద్రాసు చేనేత సత్యాగ్రహం గురించి కూడా ఉదహరించారు. 'చేనేత పరిశ్రమ' అనే ఖండకావ్యం చీరాలకు చెందిన కవులు 1946లో ప్రచురించగా, 1955లో కార్యంపూడి నాగభూషణం 'చేనేత' ఖండ కావ్యం ప్రచురించారు. కవి రాధేయ రాసిన 'మగ్గం బతుకు' దీర్ఘ కవితలో... చేనేత బతుకుల విషాదాలకు కారణాలను కవి మాటల ద్వారానే చెప్పారు. 'పల్లవి ప్రపంచీకరణది/ చరణం సామ్రాజ్యవాదానిది/ పాపం పాలన యంత్రాంగానిది....', 'నా జాతి జీవనానిదా/ నేతతో రూపు దాల్చిన/ ఈ జాతీయ జెండాదా?' అంటారు. ఇలా ఎందరో తెలుగు కవులు రైతన్న నేతన్నల స్థితిగతుల గురించి తమ రచనల ద్వారా స్పందించిన తీరును స్ఫూర్తివంతంగా ఒడిసి పట్టి ఆవిష్కరించారు ఈ రచయిత్రి.
పరిస్థితులకు కారణాలు చెప్పి ఊరుకోకుండా రెండు రంగాల్లో నెలకొని ఉన్న సంక్షోభాలు సమసిపోవడానికి అనేక సూచనలు చేశారు. వాటిని ఆచరించాల్సిన బాధ్యత పాలకులది. రైతులు, నేతకారులు అభివృద్ధి దిశగా ఎదగాలన్న ఆశయంతో కడదాకా జీవించిన ఈ పరిశోధక రచయిత్రి 2020 సెప్టెంబర్‌లో 16న గుంటూరులో కన్ను మూశారు. ఆమె ఆశయం సదా చిరంజీవి. తన జీవన లక్ష్యం నెరవేర్చడమే ఆమెకు నిజమైన నివాళి.
(మే 10 : ఆచార్య తేళ్ళ సత్యవతి జయంతి)
- డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు, 77298 83223










