Jul 12,2023 08:55

వేసవి తాపం నుంచి ఉపశమనం ఇచ్చేది వర్షాకాలం. రైతులకు అతి ముఖ్యమైన కాలమిదే. వర్షాలు సమద్ధిగా కురిస్తేనే పాడిపంటలతో దేశం సస్యశ్యామలమవుతుంది. వర్షాకాలంలో రకరకాల ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. సాధారణంగా వర్షాకాలం అంటే పాములు సంచరించే కాలం. వర్షాకాలంలో వర్షాలకు ప్రకతి మొత్తం పచ్చగా తయారవుతుంది. ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన గడ్డి దుబ్బులు, బహిరంగ ప్రదేశాల్లో గుబురుగా పెరిగిన మొక్కలు వెరసి అది పాములకు అడ్డాగా మారుతుంది. ఏటేటా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ నెల వరకు వర్షాకాలం కావడంతో విషకీటకాలు కూడా విజంభిస్తాయి. పంట పొలాలకు నీరుపెట్టేందుకు వ్యవసాయ పనులకు పగలూ రాత్రీ తేడా లేకుండా ఎప్పుడంటే అప్పుడు రైతులు వెళ్లి వస్తుంటారు. ఈ సమయంలో అప్రమత్తంగా లేకపోతే పాముల రూపంలో మత్యువు కాచుకుని ఉండొచ్చు.

111


                                                                     అన్నదాతలూ...జర భద్రం

పల్లెటూర్లలోని పంట పొలాల్లో, అటవీ ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల్లో, దట్టంగా అల్లుకున్న పొదల దగ్గర పాములు తరచూ సంచరిస్తూ ఉంటాయి. వర్షాకాలం మొదలైన తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పాముకాటు బాధితులు రోజురోజుకూ వందల్లో పెరిగిపోతుంటారు. వర్షాకాలంలో బురద ఎక్కువగా ఉండటం.. చెట్లు పొదలుగా పెరగడం వల్ల ఒక్క పాములే కాదు.. మండ్రకప్ప, తేలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. వాటి కాటుకు కూడా గురై పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూఉంటారు. ఏటేటా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకూ పాములు, ఇతర విష కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది.
 

                                                                 అన్ని పాములూ విష పూరితం కాదు

మనకు కనిపించే అన్ని పాములూ విషపూరితం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తపింజర, త్రాచు, కట్లపాము వంటి విషపాముల వల్లే ప్రమాదం ఉంటుందని, 50 శాతానికిపైగా పాముల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు. అయితే ఏ పాము అయినా.. కాటేసిన వెంటనే వైద్యుని సంప్రదిస్తేనే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు.
 

                                                                        నాగుపాము ప్రమాదకరం

నాగుపాము అత్యంత ప్రమాదకరమైంది. ఇది కాటువేస్తే 15 నిమిషాల్లో విషం ఎక్కుతుందని వైద్యనిపుణులు అంటున్నారు. ముందుగా కాటు వేసిన చోట నుంచి విషం పైకి వెళ్లకుండా వెంటనే కట్టు కట్టాలి. ఆ తర్వాత దగ్గరలోని ఆస్పత్రికి తరలించాలి. నాగుపాము విషం ముఖ్యంగా మనుషుల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తపింజరి సాధారణంగా జనావాసాల్లో అంతగా కనిపించదు. అటవీప్రాంతంలోనే ఎక్కువగా తిరుగుతుంది. అయితే ఈ పాము కాటు వేస్తే 2 గంటల తర్వాత విషం శరీరానికి ఎక్కుతుందని చెబుతున్నారు. రక్తపింజర కాటువేసిన వెంటనే తప్పనిసరిగా అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి. కట్లపాము కాటేస్తే ప్రాణాపాయం చాలా ఎక్కువ. విషం రక్తంలోకి చేరకముందే చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది.
          ఏటేటా వర్షాకాలంలో కృష్ణా, గోదావరి నదులకు వరద ముంపు రావటంతో పరివాహక, తీర గ్రామాలకు నీరు తాకుతూ ఉంటుంది. అలా కుదేలైన ఆయా గ్రామాల ప్రజలను పాములు బెంబేలెత్తిస్తుంటాయి.
 

                                                                 వ్యవసాయ సీజన్‌లోనే ఎక్కువ

ఏటేటా వ్యవసాయ సీజన్‌లో విషసర్పాల కాట్లు కేసులు నిలువెల్లా వణికిస్తుంటాయి. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ముంపు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల నీటి ప్రవాహాల కారణంగా పెద్ద ఎత్తున పాములు కొట్టుకు రావడమే కాదు పుట్టలు, బొరియలు, భూమి నెర్రెల నుంచి బయటకు వచ్చి ఊళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆ క్రమంలో అవి ప్రాణ భయంతోటి కనబడినవారినల్లా కాటేస్తున్నాయి. పాము కాటుకు గురైన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించి, వెంటనే మెరుగైన చికిత్సకు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రాణాపాయం నుంచి బయట పడే అవకాశాలు ఉంటాయి.