
ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమ గోదావరి జిల్లా) : పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని ఆచంట కచేరి సెంటర్ లో ఉన్న ఆచంట మార్టేరు ఆర్ అండ్ బి ప్రధాన రహదారి నీట మునిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు, వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మండలంలో ఈ వర్షాలకు ప్రధాన రహదారులు, లింక్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు, అధ్వానంగా మారాయి. మండలంలో ఆచంట, కొడమంచిలి, కోడేరు, కందరవల్లి, కరుగోరుమిల్లి, బీమలాపురం, వల్లూరు, పెనుమంచిలి, ఆచంట, వేమవరం, తదితర గ్రామాల్లో వర్షాలకు రహదారులు అధ్వానంగా మారాయి. పలు పల్ల ప్రాంతాలు జలమయమయ్యాయి. నివాస ప్రాంతాలు కాలనీలో సీసీ డ్రైనేజీలు నిర్మించకపోవడంతో వర్షాలకు ప్రధాన రోడ్లు సైతం జలమయమవుతున్నాయి. సిసి రోడ్లు ఎత్తుగా వేయడం వల్ల కచ్చా డ్రైనేజీలో నీరు బయటకు వెళ్లి అవకాశం లేక సమీపంలోని గ్రావెల్ మెటల్ రోడ్లు నీట మునుగుతున్నాయి. దీంతో నివాస ప్రాంతాల చుట్టూ కూడా వర్షం నీరు చేరుతుంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో అనేక అంటు రోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి రహదారులపై నిలిచిపోతున్న వర్షపు నీటిని బయటకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.