Dec 11,2022 11:38
  • ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు -తిరుపతి అతలాకుతలం
  • 30 చోట్ల 50మి.మీ కంటే అధికం
  • సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు
  • సహాయచర్యలు చేపట్టండి : సిఎం ఆదేశం
  • తమిళనాడులో నలుగురు మృతి

ప్రజాశక్తి - యంత్రాంగం : మాండూస్‌ తుపాన్‌ రాష్ట్రంలోని ఆరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ జిల్లాల్లోని 32 ప్రాంతాల్లో 50 మిల్లీమీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైంది. రాత్రి పది గంటల ప్రాంతంలో కూడా ఈ జిల్లాలతో పాటు, మరికొన్ని ఇతర జిల్లాల్లోనూ వర్షం కురుస్తూనేఉంది. బాపట్ల జిల్లా, చీరాల వాడరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. శనివారం తెల్లవారు జామున తమిళనాడులోని చెన్నై సమీపాన ఉన్న మాముల్లాపురం (మహాబలిపురం) వద్ద తీరం దాటిన తుపాన్‌ ఆ తరువాత బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది మరింత బలహీనపడుతుందని, అయితే, దీని ప్రభావంతో ఆదివారం నాడుకూడా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాన్‌ తీరం దాటే సమయంలో కురిసిన భారీ వర్షధాటికి తమిళనాడులో బీభత్స పరిస్థితులు నెలకొన్నాయి. నలుగురు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 100 పశువులు మరణించాయి. 200 ఇళ్లు నేలకూలాయి. తమిళనాడులో నష్టతీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. సహాయచర్యలు తక్షణమే తీసుకున్నందున మరణాల సంఖ్యను నివారించగలిగామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ చెప్పారు. మరోవైపు శనివారం ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాధిత ప్రజలను ఆదుకునేందుకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్ష తీవ్రత తగ్గిన తరువాత నష్టాల లెక్కలు తీయాలని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌. జవహర్‌రెడ్డి కూడా తుపాన్‌ పీడిత జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా అనేక గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగినట్లు ఆయన చెప్పారు. శనివారం మధ్యాహ్నానికి 708 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అవసరమైతే మరింతమందిని తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

11


 

                                                                             ఏ జిల్లాలో ఎంత ...?

శనివారం ఉదయం 8.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుపతి జిల్లాలో అత్యధికంగా 24 మి.మీ వర్షపాతం నమోదైంది. తిరుపతి పట్టణంలో ఎక్కడ చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో 23.4, చిత్తూరులో 22, అన్నమయ్య జిల్లాలో 20.5, వైఎస్‌ఆర్‌ కడపలో 13.2, ప్రకాశం జిల్లాలో 10.1 మి.మీ వర్షపాతం నమోదైంది.
 

                                                            తిరుపతిలో పొంగుతున్న నదులు..వాగులు

వర్ష ధాటికి తిరుపతిలో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. స్వర్ణముఖి నదికి పెద్దఎత్తున వరద వచ్చి చేరుతుండటంతో ప్రధాన రహదారిలోని కాజ్‌వేలపైకి నీరు పొంగి ప్రవహిస్తోంది. కేవీబీపురం మండలం కాలంగి, రేణిగుంట రిజర్వాయర్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 10 గేట్లను 9 అడుగుల మేర ఎత్తి 15వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా దిగువన ఉన్న పూడికేపురం- రాజుల కండ్రిగ మధ్య కాజ్‌వే కొట్టుకుపోయింది.మల్లిమడుగు రిజర్వాయర్‌లో మూడు గేట్లు ఎత్తివేశారు. కింద ఉన్న వెదల్లాచెరువు గ్రామస్తులను సురక్ష ప్రాంతానికి తరలించారు.వెంకటగిరి నియోజకవర్గంలోని కైవల్య నది పొంగిపొర్లుతోంది,
 

                                                                              తిరుమలలో

తిరుమలలోని అన్ని జలాశయాలు గరిష్ఠస్థాయికి చేరుకుంటున్నాయి. పాపవినాశనం, ఆకాశగంగ, శ్రీవారి పాదాలు తీర్థాలకు వెళ్లే మార్గాలను టీటీడీ మూసేసింది. కొండ పై కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. తుపాను కారణంగా శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 

                                                         నెల్లూరులో నీటమునిగిన నారుమళ్లు

నెల్లూరు జిల్లాలో వేలాది ఎకరాల్లో నారుమళ్లు నీటమునిగాయి. ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే నారు పాచిపోయే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. వరికుంటపాడులో విద్యుత్‌ తీగలు తెగి నాలుగు గొర్రెలు మృతి చెందాయి
 

                                                                 కడపలో గోడకూలి ఒకరు మృతి

వర్షాల కారణంగా నానిన గోడ కూలడంతో ఒకరు మృతి చెందారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని దర్జిపల్లెలో ఈ మిగతా 5లో సంఘటన చోటుచేసుకుంది. గోడ కూలి కొమ్ము పద్మావతి (43) అనే మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చాపాడు, బ్రహ్మంగారిమఠం మండలాల్లో వరి పంట నేలకొరిగింది.
 

                                                       ప్రకాశంలో 3 వేల ఎకరాలకుపైగా పంట నష్టం

రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం జిల్లాలో 3,190 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాధమిక అంచనా వేశారు. శింగరాయకొండ, పొన్నలూరు, సంతనూతలపాడు మండలాల్లో పొగాకు 354 ఎకరాలు, మినుము 2836 ఎకరాల్లో నష్టం జరిగింది.
 

                                                     ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలి : చంద్రబాబు

మాండౌస్‌ తుఫాను తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. బాధితులకు అవసరమైన చర్యలు చేపట్టాలని శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. తుఫాన్‌ ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఎప్పటికప్పుడు తుఫాను సమాచారాన్ని ప్రజలకు చేరవేసి వారిని అప్రమత్తం చేయాలని కోరారు. అవసరం మేరకు వసతులతో సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. తుఫాను ప్రభావంతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ధాన్యం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులకు చేయూత అందించాలని కోరారు. రైతులను ఉదారంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. తడచిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో టిడిపి నాయకులు, శ్రేణులు బాధితులకు అండగా నిలవాలని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.
 

                                                       తుపాను ప్రభావిత ప్రాంతాల్లో స్టాలిన్‌ పర్యటన

మాండూస్‌ తుపాను తమిళనాడులో బీభత్సం కలిగించింది. తమిళనాడు రాజధాని చెన్నైతోపాటు సముద్ర తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతో పలుచోట్ల భారీ వక్షాలు నేలకూలాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచి తటాకాలను తలపిస్తున్నాయి. తమిళనాడులో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 98 పశువులు మృతి చెందాయి. 181 నివాసాలు దెబ్బతిన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ప్రమాద వివరాలను మీడియాకు తెలియజేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను ఆయన శనివారం పరిశీలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల విద్యుత్‌ వైర్లు తెగిపోవడంతో అంధకారం నెలకొన్నది. ఆగేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్‌ తుపాను అల్పపీడనంగా బలహీనపడిందని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌ తెలిపారు. తమిళనాడులో మరో రెండు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలించినట్లు చెప్పారు. 33 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసామని, 778 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. 1469 ఆహారపు ప్యాకెట్లు, 2495 వాటర్‌ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.