Nov 04,2023 09:38

భారతీయ సంస్కృతిలో సంగీతం ఒక అంతర్భాగం. సప్త స్వరాలనే వారసత్వ ఆస్తిగా భావించిన సంగీత కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ కోవకే చెందుతుంది శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రాపాక గ్రామానికి చెందిన సింహాద్రి సత్యనారాయణ కుటుంబం. కాలాన్ని మరిపించి, మానసిక ఆనందం కలిగించే సంగీత పరికరాల్లో హార్మోనియం ఒకటి. ఇప్పటికీ ప్రముఖ సంగీత దర్శకులెందరో హార్మోనియంపైనే పాటలకు ట్యూన్లు కడుతున్నారంటే సరిగమల ప్రపంచంలో దాని ప్రాధాన్యత ఏమిటో తెలుస్తుంది. అలాంటి హార్మోనియానికి శ్రీకాకుళం జిల్లాలోని రాపాక కేరాఫ్‌ అడ్రసుగా నిలుస్తోంది.

harmonium

హార్మోనియం పెట్టెకు ఎందరో సామాన్యులను మాన్యులను చేసింది. వారి శ్రుతి, లయలకు నడకలు నేర్పింది. రాపాక జంక్షన్‌లో నేటికీ మూడు స్వరాలు, ఆరు రాగాలుగా విరాజిల్లుతోంది. పొందూరు ఖాదీ, బొబ్బిలి వీణ, కాకినాడ కాజాలకు ఎంతటి పేరుందో రాపాక హార్మోనియంలకు రాష్ట్రవ్యాప్తంగా అంతటి పేరుంది. ఆంధ్రా, తెలంగాణాతోపాటుగా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సంగీత, జానపద, రంగ స్థల కళాకారులు వీటిని బాగా ఆదరిస్తున్నారు.
 

                                                                వృత్తికే అంకితమైన సింహాద్రి కుటుంబం

గతంలో ఎంతో ఉజ్వలంగా కొనసాగిన హార్మోనియం పరిశ్రమ నేడు మసక బారినా ప్రాధాన్యతను మాత్రం కోల్పోలేదు. గతంలో వీటి తయారీదారులు, మరమ్మతులు చేసేవారు అనేకమంది ఇక్కడ ఉండేవారు. ఈ వృత్తిలో మనుగడ కష్టసాధ్యం కావటంతో అనేకమంది పనివారు వేరే పనుల్లోకి మారిపోయారు. స్థానిక సింహాద్రి సత్యనారాయణ కుటుంబం మాత్రం ఈ వృత్తికే అంకితమై రాపాక హార్మోనియం వైభవాన్ని కాపాడుతోంది. సంగీత వాయిద్యాల తయారీకి ఆదరణ, ఆదాయం తగ్గిపోతున్నప్పటికీ ఆ వృత్తిపై, సంగీతంపై మక్కువతో హార్మోనియం తయారీలో కుమారులకు కూడా తర్పీదునిచ్చి, వారిని సైతం ఈ రంగంలోనే కొనసాగించటం సత్యనారాయణ కళాతృష్ణకు నిదర్శనం.
 

                                                            స్వయంకృషితో ఎదిగిన సత్యనారాయణ

సంగీతంలో తగినంత ప్రవేశం, వడ్రంగంలో ప్రావీణ్యం ఉండి నిపుణులైన సత్యనారాయణ మంచి హార్మోనియం తయారీదారుగా గుర్తింపు పొందారు. పీసపాటి నరసింహమూర్తి వంటి నట చక్రవర్తుల సరసన హార్మోనిస్టుగా తగినంత సంగీతానుభవం, స్వయంకృషితో నేర్చుకున్న వండ్రంగం ఆయన్ను ఈ కళలోనూ మెరిపించాయి. ఆయన కుమారులు శ్రీనివాసరావు, అన్నాజీరావు కూడా తండ్రి శిష్యరికంలో రాటుదేలి ఈ వృత్తినే జీవనాధారంగా మలచుకున్నారు.
 

                                                                          విభిన్న మోడళ్లలో ...

సంగీత రంగంలో ప్రవేశంపాటు వడ్రంగి పనిలో ప్రావీణ్యం పొందిన సింహాద్రి సత్యనారాయణ ప్రస్థానం 2006లో ముగిసింది. తండ్రి నేర్పిన విద్యకు పదునుపెడుతూ మరింతగా ఆయన కుమారులు రాణిస్తున్నారు. భజనలకు ఉపయోగించే సింగిల్‌ రీడ్‌, బుర్ర కథ, హరికథలకు ఉపయోగించే డబుల్‌రీడ్స్‌, నాటకాలకు వాడే త్రిబుల్‌ రీడ్స్‌, బాలనాగమ్మ తదితర సెట్టింగ్‌ నాటకాలకు ఉపయోగించే ఫోర్త్‌ రీడ్‌, ఫెడల్‌ హార్మోనియంలు వీరు తయారు చేస్తున్నారు. రూ.8000 నుంచి రూ.1.50 లక్షల ధరల్లో అన్ని రకాల హార్మోనియంలు తయారులు చేయటంలో వీరు వాసికెక్కారు.
 

                                                           గుజరాత్‌, మహారాష్ట్రల నుంచి ముడిసరుకు

హార్మోనియం తయారీ కొంచెం కష్టమే. ఖర్చుతో కూడుకున్నదే. దీనికి అవసరమైన కడ్డీలు, వైర్లు, తోలు, సెల్యులాయిడ్‌, ప్లాస్టిక్‌ తదితర ముడిసరుకులు మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఎక్కువకాలం ఉండేందుకు రాజమండ్రి నుంచి టేకు, గుమ్మడి కలపలను తెస్తున్నారు. మరికొన్నింటిలో పనస కలపను కూడా వాడుతున్నారు. సాధారణంగా 15 రోజుల నుంచి ఆరు నెలలు కాలంలో తయారుచేసేవి కూడా ఉన్నాయి. కోరుకున్న డిజైన్లు, మన్నిక, రూపం, ధరలు ఇలా వర్గీకరించి కళాకారులు మెచ్చేలా తయారుచేస్తున్నారు. సింగిల్‌ రీడ్‌ హార్మోనియం విలువ రూ.8000 నుంచి రూ.10 వేలు, డబుల్‌ రీడ్‌ రూ.15 వేలు నుంచి రూ.30 వేలు వరకూ, త్రిబుల్‌ రీడ్‌ ధర రూ.70 వేలు నుంచి రూ.1.50 లక్షల మధ్య ఉంటుంది. ఇవి కాకుండా వేరే డిజైన్లు, సైజుల్లో ఎవరైనా ఆర్డర్‌ ఇస్తే దానికి అనుగుణంగా తయారుచేసి ఇస్తున్నారు.

harmonium 02


                                                                   రాయితీ రుణాలు ఇవ్వాలి

మేము తయారుచేసే హార్మోనియంలకు రాష్ట్రస్థాయిలో పేరుంది. తరతరాలుగా వీటి తయారీనే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నాం. అన్ని ఖర్చులు పోను మాకు కూలి రూ.500 చొప్పున మాత్రమే మిగులుతోంది. అందువల్ల ఇప్పటికి మేము ఆర్థిక స్వావలంబన సాధించలేకపోతున్నాం. పెట్టుబడి లేకపోవటంతో హార్మోనియాలు కొనుగోలు చేసే వారి నుంచి అడ్వాన్సు తీసుకుని తయారుచేస్తున్నాం. ప్రభుత్వం రుణాలు ఇస్తే ప్రోత్సాహకరంగా ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం కింద రూ.లక్ష రుణంగా ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నాం.
                   - సింహాద్రి అన్నాజీరావు, హార్మోనియం తయారీదారు

                                                               

                                                                    ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం

హార్మోనియం తయారీ పరిశ్రమను మా కుటుంబ వారసత్వంగా కొనసాగిస్తున్నాం. ఉత్తరాంధ్రలో మాకు మంచి పేరుంది. తయారీకి బాగా ఖర్చు అవుతుంది. ముందు మేము పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అందువల్ల భారంగా మారి కొన్ని ఆర్డర్లు వదిలేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ముందస్తు ఆర్డర్లకు అడ్వాన్సులు తీసుకుని తయారుచేస్తున్నాం. రాష్ట్రప్రభుత్వం స్పందించి హార్మోనియం పరిశ్రమగా గుర్తించి రుణాలు ఇస్తే బాగుంటుంది. ఇది చాలా నైపుణ్యమైన కళ. మేము కొనసాగిస్తాం. ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందించాలని కోరుతున్నాం.
                                                                                                            - సింహాద్రి శ్రీనివాసరావు, హార్మోనియం తయారీదారు

-కొంచాడ మహేశ్వరరావు,
పొందూరు విలేకరి, శ్రీకాకుళం జిల్లా
9652885898