జాత్యహంకార పోలీస్ అధికారిని తొలగించాలి : జాహ్నవి మృతి కేసులో ఆన్‌లైన్ పిటీషన్‌కు విశేష స్పందన
వాషింగ్టన్ : అమెరికాలో మరణించిన భారత విద్యార్థిని కందుల జాహ్నవికి న్యాయం చేయాలని ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఆమె మృతి గురించి చులకనగా మాట్లాడిన సీటెల్ పోలీస్ అధికారి డానియల్ ఆర్థర్‌ను విధుల నుంచి తొలగించాలని ఆన్‌లైన్ పిటీషన్ ప్రారంభమయింది. వేలాది మంది పిటీషన్‌పై సంతకం చేశారు. ఆర్థర్‌ను విధుల నుంచి తొలగించాలని, ఆయన చర్యలు ప్రజాభద్రతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా లేవని పిటీషన్‌దారులు తెలిపారు. ఆర్థర్‌పై చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే పోలీస్ వ్యవస్థపై మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించగలరని ఉన్నతాధికారులకు పిటిషన్‌దారులు విజ్ఞప్తి చేశారు.
జాహ్నవి మృతిపై పోలీస్ అధికారి డానియల్ ఆర్థర్ చులకనగా మాట్లాడినట్లు వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ సీటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ ఒక ప్రకటన విడుదల చేసింది. వీడియోలో వినిపిస్తున్న ఆర్థర్ వ్యాఖ్యలు జాహ్నవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావని తెలిపింది. ఆర్థర్ వ్యాఖ్యలకు సంబంధించి వైరల్‌గా మారిన వీడియోలో సంభాషణలు పూర్తిగా లేవని చెప్పింది. 'వైరల్ అయిన దృశ్యాలు బాడీక్యామ్ వీడియో రికార్డ్ చేసినవి. ఆ సంభాషణల్లో ఒకవైపు మాత్రమే బయటికొచ్చింది. అందులో ఇంకా చాలా వివరాలున్నాయి. అవి ప్రజలకు తెలియవు. పూర్తి వివరాలు తెలియకపోవడంతో అక్కడ అసలేం జరిగిందో చెప్పడంలో మీడియా విఫలమైంది' అని గిల్డ్ ప్రకటనలో తెలిపింది. తన వ్యాఖ్యలు జాహ్నవిని ఉద్దేశించినవి కావని, న్యాయవాదులను ఉద్దేశించి చేసివని అని ఈ ప్రకటనలో డానియల్ చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కోర్టుల్లో న్యాయవాదుల వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వానని డానియల్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కందుల జాహ్నవి ఈ ఏడాది జనవరి 23న సీటెల్‌లో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢకొీని మరణించింది. జాహ్నవి మృతి గురించి ఆర్థర్ వ్యాఖ్యల వీడియో ఈ నెల 14న వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి.