Aug 02,2023 22:46
  • అసాధారణ పరిస్థితిని పరిష్కరించాలని రాష్ట్రపతికి ప్రతిపక్షాల వినతి
  •  చర్చకు కేంద్రం నిరాకరిస్తోంది
  •  ఇంటర్నెట్‌ నిషేధంతో సడలిన విశ్వాసం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆలస్యం చేయకుండా మణిపూర్‌లో శాంతి స్థాపనకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రతిపక్ష నాయకులు విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌ రాష్ట్రం ఎదుర్కొంటున్న అసాధారణ పరిస్థితిని వీలైనంత త్వరగా పరిష్కరించి, తక్షణమే సాధారణ స్థితికి తీసుకురావాలని కోరారు. రెండు రోజుల పాటు మణిపూర్‌లో పర్యటించిన 21 మంది ఎంపిలతో పాటు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్‌ లీడర్లు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వినతి పత్రం సమర్పించారు. ''గత కొన్ని నెలలుగా మణిపూర్‌లో పరిస్థితి క్లిష్ట స్థితికి చేరుకుంది. శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆన్‌లైన్‌లో వెలువడిన షాకింగ్‌ వైరల్‌ వీడియో దేశాన్ని ద్రిగ్భాంతికి గురిచేశాయి. ఈ విషయాన్ని వెంటనే పరిష్కరించడంలో రాష్ట్ర పరిపాలన వ్యవస్థ, పోలీసులు విఫలమయ్యారని స్పష్టంగా తెలుస్తుంది. విచారణ చేపట్టి నిందితుడిని పట్టుకునేందుకు రెండు నెలలకు పైగా జాప్యం చేయడం సమస్య తీవ్రతను మరింత పెంచింది. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన అనేక కేసుల్లో ఒక ఘటన మాత్రమే వెలుగులోకి వచ్చింది'' అని తెలిపారు. ''బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఇండియా కూటమి పార్టీలకు చెందిన 21 మంది పార్లమెంట్‌ సభ్యుల ప్రతినిధి బృందం జూలై 29-30 రెండో రోజుల పాటు మణిపూర్‌లోని హింస ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, మణిపూర్‌ ప్రజలకు సంఘీభావ సందేశాన్ని ఇచ్చి, వాస్తవికతను అంచనా వేసింది. మహిళలు, పిల్లలతో సహా ప్రజలు ఎదుర్కొంటున్న విధ్వంసం, కష్టాలను ఎంపీలు చూశారు. భయంకరమైన, పరిస్థితుల గురించి దేశానికి తెలియజేశారు. ఈ బృందం మణిపూర్‌ గవర్నర్‌ను కూడా కలిసి వాస్తవ పరిస్థితులను తెలియజేసింది. గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించింది'' అని ప్రతిపక్ష నాయుకులు రాష్ట్రపతికి వివరించారు.
''హింసాకాండతో మణిపూర్‌ వినాశకరంగా మారింది. 200 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. 500 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. 5 వేల కంటే ఎక్కువ ఇళ్లు దగ్ధం అయ్యాయి. 60 వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. సహాయక శిబిరాల్లో దుర్భరమైన పరిస్థితుల్లో బాధితులు నివసిస్తున్నారు. చురచంద్‌పూర్‌, మోయిరాంగ్‌, ఇంఫాల్‌తో సహా మూడు విభిన్న సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లోని సహాయక శిబిరాలను ప్రతినిధి బృందం సందర్శించింది. అక్కడ బాధితులతో సంభాషించారు. వారి సమస్యలను విన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల జీవన పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారు. సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలు ఆహారం, సహాయక సామాగ్రి సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు భయం, అభద్రతా స్థితిలో జీవిస్తున్నారు. వారి జీవితాలను పునర్నిర్మించుకోవడానికి సురక్షితమైన, న్యాయమైన పునరావాసం అవసరం. రాష్ట్రంలో మూడు నెలల పాటు ఇంటర్నెట్‌ నిషేధం వివిధ వర్గాల మధ్య అపనమ్మకాన్ని మరింత పెంచింది. తప్పుడు సమాచారం వ్యాప్తికి అనుమతించింది. దాదాపు మూడు నెలల పాటు పాఠశాలలు, కళాశాలలను సుదీర్ఘంగా మూసివేయడం మణిపూర్‌లో పిల్లలు, యువత విద్యపై ప్రతికూల ప్రభావం చూపింది'' అని వినతిపత్రంలో తెలిపారు.
''ఈ సందర్భంలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి, ఇండియా కూటమి పార్టీలు ప్రధానమంత్రి నుండి ప్రకటనను డిమాండ్‌ చేస్తున్నాయి.
అత్యంత జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ అంశంపై వివరణాత్మక, సమగ్ర చర్చ జరగాలని కోరుతున్నాయి. సంబంధిత నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చినప్పటికీ, ఈ డిమాండ్లు పార్లమెంట్‌ ఉభయ సభల్లో తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారు. రాజ్యసభలో ప్రజల వాణి వినిపించే ప్రతిపక్ష నేతల నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. తాము మాట్లాడకుండా మైక్‌ కట్‌ చేస్తున్నారు. దీన్ని మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కొత్తగా తీసుకురావడం చాలా ఆందోళన కలిగిస్తుంది'' అని అన్నారు.
''ఇకనైనా ఆలస్యం చేయకుండా రాష్ట్రంలో శాంతి సామరస్యాలను నెలకొల్పేందుకు దయతో జోక్యం చేసుకోండి. గత 92 రోజులలో జరిగిన విధ్వంసానికి బాధ్యలను గుర్తించాలి. బాధిత వర్గాలకు న్యాయం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం రెండూ తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలి. మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులపై పార్లమెంట్‌లో అత్యవసరంగా ప్రసంగించవలసిందిగా ప్రధానమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలి. ఆ తరువాత ఈ విషయంపై వివరణాత్మక, సమగ్రమైన చర్చ జరగాలి'' అని కోరారు. మణిపూర్‌ ప్రజల బాధలను తొలగించడంలో, రాష్ట్రంలో సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో జోక్యం చేసుకోవాలని వారు రాష్ట్రపతిని కోరారు.
అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ మణిపూర్‌ సమస్యను రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మణిపూర్‌లో పర్యటించి, శాంతిని పునరుద్ధరించేందుకు కృషి చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్‌ అని అన్నారు. మణిపూర్‌లో పర్యటించిన 21 మంది ఎంపిలతో పాటు శరద్‌ పవర్‌ (ఎన్‌సిపి), సుదీప్‌ బందోపాధ్యాయ (టిఎంసి), తిరుచ్చి శివ (డిఎంకె), ఫరూక్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫెరెన్స్‌), వైకో (ఎండిఎంకె), జోష్‌ కె. మణి (కేరళ కాంగ్రెస్‌), ఎఎ రహీం (సిపిఎం), సంజరు సింగ్‌ (ఆప్‌), సంజరు రౌత్‌ (శివసేన ఠాక్రే), రామ్‌ గోపాల్‌ యాదవ్‌ (ఎస్‌పి) తదితరులు రాష్ట్రపతిని కలిసినవారిలో ఉన్నారు.