Aug 10,2023 08:11

ఒక అడవిలో ఏనుగు ఆహారం కోసం వెళ్లింది. ఇంతలో ఒక కుందేలు ఏనుగుతో 'ఏనుగు మామా! త్వరగా పరిగెత్తు. నిన్ను నీవు కాపాడుకో! వెనుక నుండి ప్రమాదం వస్తున్నది' అని అంది. కుందేలు మాటలకు భయపడిపోయిన ఏనుగు పరిగెత్తుతూ పరిగెత్తుతూ.. అనుకోకుండా వేటగాళ్లు తవ్విన గోతిలో పడిపోయింది. ఇది ఒక నక్క గమనించింది .
వెంటనే అది సింహం వద్దకు వెళ్లి కుందేలుపై ఫిర్యాదు చేసింది. సింహం వెంటనే కుందేలును పిలిపించింది. సింహం వద్దకు వచ్చిన కుందేలుతో 'నీవు ఏనుగును భయపెట్టి ఆ గోతిలో పడేలా, వేటగాళ్లకు దొరికేలా చేశావని నక్క నీపై ఆరోపణ చేస్తున్నది. దీనికి నీ సమాధానం ఏమిటి?' అని అడిగింది. అప్పుడు కుందేలు 'మృగరాజా, నేను ఏనుగును భయపెట్టలేదు. పొరుగు అడవికి చెందిన సింహం ఈ అడవికి రావడం చూసిన నేను అది ఏనుగుపై దాడి చేస్తుందని దానిని హెచ్చరించాను. ఆ ఏనుగు పొరపాటున వేటగాళ్లు తవ్విన గోతిలో పడింది. ఆ సింహానికి భయపడి నేను కూడా అక్కడే ఆ చెట్ల గుబురులో దాక్కున్నాను. ఈ లోపు అటుగా మీరు రావడం చూసిన ఆ సింహం అక్కడి నుండి పారిపోయింది. ఇదంతా మీరు గమనించకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత నేను వెంటనే ఆ ఏనుగు బంధువులకు ఆపదలో ఉన్న ఏనుగు గురించి చెప్పాను. అవి వెంటనే వచ్చి ఆ ఏనుగును గోతి నుండి బయటకు లాగి కాపాడాయి. ఈ సంగతంతా తెలియని నక్క తొందరపాటుతో మీ దగ్గర నాపై ఫిర్యాదు చేసింది' అని చెప్పింది.
అప్పుడు సింహం ఆ ఏనుగును పిలిచి కుందేలు చెప్పిన సంగతి గురించి అడిగింది. 'కుందేలు నాకు అపాయం కలిగించలేదు. ఆపదలో ఉన్న నన్ను రక్షించింది. వేటగాళ్ల బారి నుంచి కాపాడిన కుందేలు సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను' అని ఏనుగు చెప్పింది. ఇదంతా విన్న సింహం, నక్కను మందలించి కుందేలును సత్కరించింది. అన్ని జంతువులు కుందేలుకు అభినందనలు తెలిపాయి. నిజం తెలుసుకోకుండా తొందరపడి ఇతరులను అపార్థం చేసుకోరాదని నక్కకు కూడా బుద్ధి వచ్చింది.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, ధర్మపురి
99085 54535