ముంబయి: రెపోరేటును ఈసారి కూడా 'భారతీయ రిజర్వ్ బ్యాంక్' 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం తగ్గడం, రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉండడమే అందుకు కారణమని వివరించారు. గతంలో రేట్లను పెంచడం వల్లే ద్రవ్యోల్బణం దిగొస్తోందని పేర్కొన్నారు.ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో 'ద్రవ్య పరపతి విధాన కిమిటీ జూన్ 6-8 మధ్య సమావేశం కానుంది. సమావేశ నిర్ణయాలను జూన్ 8న ప్రకటించనున్నారు. చివరిసారి ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలో రెపోరేటులో ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతం దగ్గర కొనసాగించారు. దీంతో 2022 మే నుంచి అనుసరిస్తున్న రేట్ల పెంపు ప్రక్రియకు విరామమిచ్చినట్లయింది. వరుస పెంపులతో రెపో రేటు 250 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది.ఏప్రిల్‌లో 'వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ' 4.7 శాతంగా నమోదైంది. ఇది 18 నెలల కనిష్ఠం. మే నెలలో ఇది మరింత దిగొచ్చే అవకాశం ఉందని ఇటీవల ఓ సందర్భంలో శక్తికాంత దాస్ అన్నారు. జూన్ 12న మే నెల సీపీఐ గణాంకాలు వెలువడనున్నాయి. రూ.2,000 నోట్ల డిపాజిట్లు కొనసాగుతున్న నేపథ్యంలో ద్రవ్యలభ్యత పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవిస్ అన్నారు. ఈ నేపథ్యంలో సర్దుబాట విధాన వైఖరిని ఉపసంహరించుకోవడాన్ని ఆర్‌బీఐ కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది రెపో రేటు 25-50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, అది అక్టోబర్ తర్వాతే ఉండొచ్చని తెలిపారు.










