Oct 02,2023 20:13

ముంబయి : అక్టోబర్‌ 4-6 తేదిల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరగనుంది. ఈ దఫా ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) భేటీలోనూ వడ్డీ రేట్ల తగ్గుదల ఉండకపోవచ్చని నిపుణులు, పరిశోధన ఎజెన్సీలు అంచనా వేస్తున్నాయి. 2022 మే నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యకాలంలో ఆర్‌బిఐ వివిధ దశల్లో రెపోరేటును 2.5 శాతం పెంచింది. దీంతో రెపో రేటు 6.5 శాతానికి చేరింది. ఆ తర్వాత వరుసగా రెపో రేట్లలో యథాతథ స్థితిని కొనసాగిస్తూ వస్తోంది. దీంతో రిటైల్‌, గృహ, వాహన రుణాలు ప్రియమయ్యాయి. రుణ గ్రహీతలపై భారం పడింది. కాగా.. వచ్చే సమీక్షాలోనూ ఖాతాదారులకు ఉపశమనం లభించకపోవచ్చని విశ్లేషణలు వెలుపడుతున్నాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు జరిగే ఎంపిసి భేటీలో ప్రస్తుత ఆర్థిక స్థితిని, ఇతర పరిణామాలను సమీక్షించనుంది. చివరి రోజు సమీక్షా నిర్ణయాలను ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మీడియాకు వెల్లడించనున్నారు.