ప్రజాశక్తి-తెనాలి(గుంటూరు) : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిలభారత రైతు, కార్మిక సంఘాల పిలుపుమేరకు బుధవారం పట్టణంలో 'క్విట్ కార్పొరేషన్.. సేవ్ అగ్రికల్చర్' అంటూ నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు బాబు ప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ సర్కార్ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతుందన్నారు. కార్మికులు ఎంతో కష్టపడి సాధించుకున్న కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా మార్చిందని, దాన్ని తిట్టుకొట్టాలన్నారు .ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబి రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చట్టం చేయాలని, కేంద్రం తెచ్చిన 2020 విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ 1942లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమం స్పూర్తి తో క్విట్ కార్పొరేషన్ ఉద్యమాన్ని ఉధతం చేస్తామన్నారు. కార్యక్రమంలో షేక్ హుస్సేన్ వలి, మంగళగిరి వెంకటేశ్వర్లు, ఎం సాంబశివరావు, వి ఆదినారాయణ, ఎం పద్మ, పి వెంకటేష్, కె.వెంకటరమణ, కె స్వాములు, బి అమరలింగేశ్వర రావు, డి పుల్లయ్య పాల్గొన్నారు.










