- భూమి, మౌలిక సదుపాయాలన్నీ ప్రభుత్వమే సమకూర్చాలంటున్న అదానీ !
- నీటి సామర్థ్యంపై నివేదిక కోరిన సర్కార్
ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పాడేరు ఏజెన్సీ అనంతగిరి మండలం పెదకోట, మైదాన ప్రాంతంలోని రైవాడ వద్ద ప్రతిపాదిత పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. పాడేరు ఏజెన్సీలో ఐదో షెడ్యూల్ పరిధిలోని చింతపల్లి మండలం ఎర్రవరం వద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టును గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.
ప్రాజెక్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. అదానీకి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఇజిఇఎల్)కు అనుమతులు మంజూరు చేసేసింది. పెదకోట, రైవాడల్లో నీటి సామర్థ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కొద్ది రోజుల క్రితం నీటిపారుదల శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. 2019 డిసెంబరులో తయారు చేసిన ప్రాథమిక అంచనా ప్రకారం... పెదకోట వద్ద వెయ్యి మెగావాట్ల హైడ్రో విద్యుత్ ప్రాజెక్టుకు రూ.3,890 కోట్లు ఖర్చు కానుంది.
ఇక్కడ ఏర్పాటు చేసే వపర్ ప్రాజెక్టు నిర్మాణానికి 683 ఎకరాలు, ట్రాన్స్‌మిషన్ లైన్ల ఏర్పాటుకు మరో 760 ఎకరాలు అవసరం. రైవాడ వద్ద రూ.2,440 కోట్ల విలువైన 600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు 683 ఎకరాలు, ట్రాన్స్‌మిషన్ లైన్ల ఏర్పాటుకు మరో 760 ఎకరాలు అవసరమని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పెదకోట, రైవాడ వద్ద నీటి సామర్థ్య పరిస్థితిపై నివేదిక ఇచ్చే పనిలో నీటిపారుదల శాఖాధికారులు ఉన్నారు. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అదానీ అనేక రాయితీలు, సదుపాయాలు కోరినట్లు తెలిసింది. ఏజెన్సీలోనూ, మైదాన ప్రాంతంలోనూ ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూమి, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే సమకూర్చాలని కోరినట్లు సమాచారం.
ప్రాజెక్టు ఏర్పాటుకు కొనుగోలు చేసే నిర్మాణ, యంత్ర సామగ్రిపై వంద శాతం జిఎస్‌టి మినహాయింపును అడిగినట్లు తెలిసింది. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో భాగంగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఎర్రవరం వద్ద పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటును శ్రీ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు, పెదకోట, రైవాడ వద్ద ఏర్పాటు చేసే ప్రాజెక్టులను అదానీకి అప్పగిస్తూ గత నెల 13న జరిగిన మంతివర్గం సమావేశంలో ఆమోదించిన తరువాత ఈ వేగం కాస్త పెరిగింది.










