
ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రభుత్వ నిర్బంధాన్ని అధిగమించి అంగన్‌వాడీలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కదంతొక్కారు. ర్యాలీలు, కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలను, వారికి మద్దతుగా నిలిచిన సిపిఎం, సిఐటియు, ఎఐటియుసి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి ఆర్‌డిఒ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల ధర్నాలో సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎంపి పి.మధు మాట్లాడుతూ తెలంగాణ కంటే మన రాష్ట్రంలో అంగన్‌వాడీలకు ఎక్కువ జీతం ఇస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయమని కోరిన వారిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్‌కు వెళ్తున్న ప్రకాశం, అనంతపురం, పల్నాడు జిల్లాలకు చెందిన పలువురు అంగన్‌వాడీలను, ఆయాలను పోలీసులు అరెస్టు చేసి గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ తరలించారు. వారిని సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు పరామర్శించారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు బెదిరించారు. అంగన్‌వాడీ యూనియన్ నాయకులను, సిఐటియు నాయకులను బలవంతంగా అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్టై స్టేషన్‌లో ఉన్న అంగన్‌వాడీలను మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ కలిసి వారి పోరాటానికి మద్దతు తెలిపారు. నంద్యాలలో అరెస్టు చేసిన నాయకులను రాత్రంతా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఉంచారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు రాస్తారోకో నిర్వహిస్తున్న అంగన్‌వాడీలకు మద్దతుగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులును పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వాహనం ఎక్కించారు. దీంతో, ఈ వాహనాన్ని అంగన్‌వాడీలు అడ్డుకొన్నారు. విజయవాడ వెళ్తున్న డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అంగన్‌వాడీలను కలపర్రు టోల్‌గేట్ వద్ద పోలీసులు అడ్డుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఏలూరులో అరెస్టు చేసి పెదవేగి పోలీసు ట్రైనింగ్ సెంటర్ వద్దకు తరలిస్తుండగా సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్ నేతృత్వంలో బస్సులను అడ్డుకుని అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో, పోలీసులు వారిని విడుదల చేశారు. రాజమహేంద్రవరం, కాకి నాడలో నిరసనలకు దిగిన అంగన్‌వాడీలు, సిఐటియు నాయకులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. అనకాపల్లిలో అంగన్‌వాడీలు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఐసిడిఎస్ పిడి కార్యాలయాన్ని ముట్టడించారు. అంగన్‌వాడీలపై నిర్బంధాన్ని ఖండిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, అరకు, చింతూరు, రంపచోడవరం, దేవీపట్నం తదితర చోట్ల నిరసనలు తెలిపారు. విశాఖ, కర్నూలు, ఏలూరు, బాపట్ల, కృష్ణా, వైఎస్‌ఆర్ జిల్లాల్లో పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ల వద్ద అంగన్‌వాడీలు ధర్నా చేశారు.