Aug 13,2023 09:36

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ)లో పనిచేస్తున్న ఆఫీసర్ల డిజిటల్‌ సిగేచర్స్‌ను ఫోర్జరీ చేసిన కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సిఐడి ఎస్‌పి హర్షవర్ధన్‌ రాజు తెలిపారు. డిజిపి కార్యాలయంలోని సిఐడి కాన్ఫరెన్స్‌ హాలులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిందితులపై క్రైమ్‌ నెంబరు 10/2023 యుఎస్‌-420, 465, 468, 471 రెడ్‌విత్‌ 120-బి ఐపిసి, అండ్‌ 66-సి అండ్‌ డి ఐటి యాక్ట్‌ ఆఫ్‌ 2000 కింద సిసిపిఎస్‌, సిఐడి ఎపి మంగళగిరి కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ముత్యాలరాజు పేషీలో పనిచేస్తున్న మాజీ డిఇఓ కనమర్ల శ్రీను, సిఎస్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌ రెడ్డి పేషీలో డిఇఓగా పనిచేస్తున్న నలజల సాయిరామ్‌, ధనుంజయరెడ్డి పేషీలో అటెండర్‌ గా పనిచేస్తున్న గుత్తుల సీతారామయ్య, ముత్యాలరాజు పేషీలో డిఇఓగా పనిచేస్తున్న భూక్యా చైతన్య నాయక్‌, సిఎస్‌ జవహర్‌రెడ్డి పేషీలో అటెండర్‌గా పనిచేస్తున్న అబ్ధుల్‌ రజాక్‌ నిందితులని తెలిపారు. తమ విచారణలో ఈ ఐదుగురు నిందితుల పాత్రపై శాస్త్రీయమైన ఆధారాలు లభ్యమయ్యాయన్నారు. ఫైల్‌ ప్రాసెసింగ్‌ చేసేందుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు సిఐడి పేర్కొంది. వసూలు చేసిన డబ్బులో సాయిరామ్‌, సీతారామ్‌, రజాక్‌ కమీషన్‌ కింద కొంత మొత్తం ఉంచుకుని శ్రీనుకి రూ.25వేల వరకు ముట్టజెప్పి సిఎంపిలు శ్రీనుతో ఇ-ఆఫీసు నుంచి పనిచేయించే వారన్నారు, శ్రీనును సిఎంఓలో ఉద్యోగం నుంచి తీసివేసిన తర్వాత కూడా బయట నుంచి సిఎంపిలు తయారు చేసి పూనం మాలకొండయ్య పేషీ ఇ-ఆపీసు ద్వారా దొంగలించిన లాగిన్‌ పాస్‌వర్డ్‌లు ఉపయోగించి రిసీప్ట్‌ జనరేట్‌ చేసి పలు శాఖలకు పంపినట్లు తెలిపారు.