Oct 16,2023 22:10

ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : ఉత్తరాంధ్ర అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి, ఉన్నతాధికారుల పర్యటనల సందర్భంగా ట్రాన్సిట్‌ అకామడేషన్‌ కోసం ఏర్పాటైన కమిటీ విశాఖపట్నంలోని విఎంఆర్‌డిఎ కార్యాలయంలో సోమవారం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి అధ్యక్షతన సమావేశమైంది. త్వరితగతిన పనులు జరిగేలా పర్యవేక్షణ చేసేందుకు ఈ కమిటీ వచ్చింది. వివిధ శాఖలకు సంబంధించిన కార్యాలయాలలో వసతి సౌకర్యాలు, సంబంధిత అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సిఎం క్యాంప్‌ ఆఫీసుగా చెప్తున్న రుషికొండను ఈ కమిటీ సందర్శించింది. ఈ కమిటీలో స్పెషల్‌ సిఎస్‌ ఫైనాన్స్‌ ఎస్‌ఎస్‌.రావత్‌, సెక్రటరీ (జిఎడి) పోలా భాస్కర్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశంలో వీరితోపాటు విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, జివిఎంసి కమిషనర్‌ సాయికాంత్‌వర్మ, జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌.విశ్వనాథన్‌, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా, డిసెంబర్‌ 21న విశాఖలోనే ముఖ్యమంత్రి జగన్‌ తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకోనున్నారని సమాచారం.