Jan 11,2023 21:39

ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి : 2023-24 ఆర్థిక సంవత్సరపు విద్యుత్‌ ఛార్జీల (టారిఫ్‌) పెంపు ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ఈ నెల 19, 20, 21న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తుందని ఎపిఇపిడిసిఎల్‌ సిఎండి కె సంతోషరావు తెలిపారు. విశాఖపట్నంలోని ఇపిడిసిఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో మూడ్రోజులపాటు ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజాభిప్రాయసేకరణ జరుగుతుందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఇఆర్‌సి చైర్మన్‌ జస్టిస్‌ సివి నాగార్జునరెడ్డి, సభ్యులు ఠాకూర్‌ రామ్‌సింగ్‌, పి రాజగోపాల్‌ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్‌ ఇంధనశాఖ, ఇపిడిసిఎల్‌, ఎస్‌పిడిసిఎల్‌, సిపిడిసిఎల్‌ అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణలో మూడు విద్యుత్తు పంపిణీ సంస్థల టారిఫ్‌పై సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. తమ అభిప్రాయాలను ఆయా జిల్లాలోని సమీప ఎస్‌ఇ, లేదా డిఇ కార్యాలయాల నుంచి ముందుగా నమోదు చేసుకున్నవారు తమ అభిప్రాయాలను తెలపాలని, నమోదుచేసుకోలేనివారు విద్యుత్తు నియంత్రణ మండలి అనుమతితో తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు.