Oct 04,2023 09:40

న్యూఢిల్లీ : భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అరెస్టు చేసిన సెమిన్‌లున్‌ గాంగ్టే కస్టడీని పాటియాలా హౌస్‌ కోర్టు మంగళవారం మరో ఎనిమిది రోజులు పొడిగించింది. ప్రస్తుతం మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండను ఉపయోగించుకుంటూ మయన్మార్‌, బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలతో కలిసి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంగ్టే కుట్రలకు పాల్పడుతున్నాడని ఎన్‌ఐఎ ఆరోపిస్తోంది. జూన్‌ 21న మణిపూర్‌లో బిష్ణుపూర్‌ జిల్లాలోని క్వాక్తా ప్రాంతంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో గాంగ్టే నిందితుడని ఎన్‌ఐఎ తెలిపింది. జులై 19న చుంచంద్‌పూర్‌ లోని అతని నివాసం వద్ద గాంగ్టేను అరెస్టు చేశారు. ఎన్‌ఐఎ వాదనలు విన్న కోర్టు గాంగ్టే కస్టడీ పొడిగింపునకు అంగీకరించింది. ఎఫ్‌ఐఆర్‌ కాపీని గాంగ్టే, ఆయన న్యాయ వాదులకు కూడా అందించాలని ఆదేశించింది.