Aug 22,2022 08:09
  • పాలకుల నిర్లక్ష్యంతో ముఖద్వారాలకు ముప్పు
  • ముందుకు సాగని పూడికతీత పనులు
  • 25 వేల మంది మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ప్రమాదంలో ఉంది. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని పులికాట్‌ సరస్సు పాలకుల నిర్లక్ష్యం వల్ల కుచించుకుపోతోంది. బంగాళాఖాతం నుంచి పులికాటుకు నీరు వచ్చే మూడు ముఖ ద్వారాలూ పూడిపోయాయి. వీటి పూడిక తీసేందుకు రూ.48 కోట్ల నిధుల కోసం మూడు దశాబ్దాలుగా ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. ఇదిగో... అదిగో... అంటూ పాలకులు వాగ్దానాలు చేయడం తప్ప, నిధులు విడుదల చేయడం లేదు. పులికాట్‌ సరస్సుపై ఆధారపడి జీవనం సాగిస్తోన్న మత్స్యకారుల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నేలపట్టు పక్షుల కేంద్రం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పులికాట్‌ సరస్సు భవిష్యత్తులో కాలగర్భంలో కలిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉమ్మడి నెల్లూరు జిల్లా చిట్టమూరు, వాకాడు, దొరవారిసత్రం, తడతోపాటు తమిళనాడులోని పలు మండలాల్లో పులికాట్‌ సరస్సు విస్తరించి ఉంది. సముద్రంలోని ఆటుపోటుల ద్వారా ఉప్పు నీరు ఈ సరస్సులోకి చేరుతుంది. ఇందుకు వాకాడు మండలం రాయదొరువు, తడ సమీపంలోని ఎదురు కుప్పం, సూళ్లూరుపేటలో సరస్సుకు ముఖద్వారాలు ఉన్నాయి. ఈ మూడు ముఖద్వారాలూ మూడు దశాబ్దాల క్రితం పూడిపోవడంతో సముద్రం నుంచి నీరు సరస్సులోకి సరిగా చేరడం లేదు. సముద్రం నుంచి సరస్సులోకి చేపలు, పీతలు, రొయ్యలు చేరుతాయి. ఈ ప్రాంతంలో సుమారు 25 వేల మంది మత్స్యకారులు వేట ద్వారా జీవనం సాగిస్తు న్నారు. ఇటీవల తరచూ ఈ సరస్సు ఎండి పోతుండడంతో వారి జీవన భృతిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రకృతి అందాలకు నిలయమైన ఈ సరస్సు ఇప్పుడు ప్రమాదంలో పడింది.
 

                                                               నేలపట్టుకు ప్రమాదం !

ప్రపంచంలోనే అరుదైన పక్షుల కేంద్రం ఇక్కడ ఉంది. దొరవారిసత్రం మండలం నేలపట్టుకు దేశ, విదేశాల పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణించి వస్తుంటాయి. ఇక్కడ సంతానోత్పత్తి చేసి మళ్లీ ఆయా ప్రాంతాలకు వెళతాయి. ప్లెమింగో ఫెస్టివల్‌ పేరుతో పక్షుల పండగను గత ఇరవై ఏళ్ల నుంచి ఏటా ప్రభుత్వాలు ఇక్కడ నిర్వహిస్తూ వస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యం వల్ల పక్షుల విడిది కేంద్రానికి ప్రస్తుతం ప్రమాదం పొంచి ఉందని పర్యావరణవేత్తలు, పర్యాటకులు అంటున్నారు. పక్షులు ఇక్కడ ఆరు, ఏడు నెలలు ఉంటాయి. ఆ సమయంలో ఆహారం కోసం పక్కనే ఉన్న పులికాట్‌ సరస్సుపై ఆధారపడతాయి. పులికాట్‌లో నీటి నిల్వలు ఉంటేనే వాటికి ఆహారం దొరుకుతుంది. ఎప్పుడు నీరు ఉంటుందో తెలియని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఆహారం దొరక్కపోతే పక్షులు ఇక్కడకు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఏ మాత్రమూ ఉండదని అంటున్నాయి.
 

                                                                   రూ.48 కోట్ల కోసం...

పులికాట్‌ సరస్సు పూర్వవైభవానికి నాలుగేళ్ల క్రితం అప్పటి కలెక్టర్‌ ముఖ్యమంత్రికి ప్రత్యేక నివేదిక ఇచ్చారు. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సిడబ్ల్యుసి) మధ్యంతర నివేదిక ఆధారంగా రాయదొరువు దగ్గర పులికాట్‌ ముఖ్యద్వారాన్ని తెరవడానికి నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఒటి)తో మూడు నెలల్లో యుద్ధప్రతిపాదికన సర్వే నిర్వహించారు. రూ.48 కోట్లతో పూర్తి ప్రాజెక్టు రిపోర్టు 2017 ఆగస్టు నాలుగు మత్స్యశాఖ కమిషనర్‌కు కలెక్టర్‌ పంపారు. అదే నెల 16న ఎహెచ్‌డిడి, మత్స్యశాఖకు నిధులు సమకూర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ పంపారు. ఈ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి నిధుల కోసం లేఖ రాసినా ఫలితం లేకపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి నెపం నెట్టుకుంటున్నాయి. నిధులను వెంటనే విడుదల చేయాలని, పులికాట్‌ సరస్సుకు పూర్వవైభవం తీసుకొని రావాలని ప్రజలు కోరుతున్నారు.