హైదరాబాద్ : హైదరాబాద్‌లో కుండపోత వాన కురుస్తోంది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో తడిసిముద్దయిన హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్‌ను జారీ చేశారు. ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిది. ఐటీ సంస్థలకు పోలీసులు లాగౌట్ అడ్వయిజరీ ఇచ్చారు. అవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ నగర వాసులకు సూచనలు అందుతున్నాయి. రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. హైదరాబాద్ వర్షాలపై.. మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు అలర్ట్ సందేశాలను ఎప్పటికప్పుడు అధికారులు పంపుతున్నారు. మంగళవారం కూడా ఉరుములు మెరుపులతో వర్షం ముంచెత్తింది. గంటలపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలన్నీ స్తంభించిపోయాయి.
జోన్లవారీగా హెచ్చరికలు...
హైదరాబాదుకు ప్రత్యేకించి ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. జోన్లవారీగా అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను అలర్ట్ చేసింది జిహెచ్‌ఎంసి. హైదరాబాదులోని చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, ఎల్బీనగర్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక కుకట్‌పల్లి జోన్ కు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. కుకట్‌పల్లి జోన్ లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
అప్రమత్తమైన అధికారులు...
హుస్సేన్‌సాగర్ గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుంది. హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పెరుగుతూనే ఉంది. దీంతో.. అధికారులు హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మూసీ నది పొంగిపొర్లుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మరో రెండు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తం అయింది. డీఆర్‌ఎఫ్ బఅందాలను రెడీ చేసింది.
ఐటీ కంపెనీల్లో వేర్వేరు లాగౌట్‌ల ప్రకటన...
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు పెరుగుతున్న వరద కారణంగా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నిర్ణయాలు తీసుంటున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు తప్పవనే తాజా హెచ్చరికలతో ... ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ఐటీ క్యారిడార్లో రెండు రోజులపాటు ఆఫీసు వేళలు మార్చుకోవాలని సూచించారు. దానిలో భాగంగా.. ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు ఒకేసారి బయటికి రాకుండా వేర్వేరు లాగౌట్ సమయాలను ప్రకటించారు. ఐకియా నుంచి సైబర్‌టవర్ వరకు ఉన్న కంపెనీలు.. మధ్యాహ్నం 3 గంటలకు, ఐకియా, బయోడైవర్సిటీ, రాయదుర్గం పరిధిలోని.. కంపెనీలు సాయంత్రం నాలుగున్నర గంటలకు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలిలోని కంపెనీలు ఈవినింగ్ ఆరు గంటలకు లాగౌట్ చేసుకోవాలని ఆదేశించారు మాదాపూర్ పోలీసులు.