- లక్షలాది మంది దూరం
- ఎపిలో రిజిస్టరైన రైతులు 60 లక్షలు
- మునుపటి కిస్తు పడని రైతులు 33 లక్షలు
- ఇ-కెవైసికి ముగిసిన గడువు
- ఇంకా 30 శాతం పెండింగ్
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం కిసాన్) పథకానికి కేంద్రం విధించిన నిబంధనలు రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులను లబ్దికి దూరం చేస్తున్నాయి. ఇంతకుముందు స్కీంకు అనర్హులంటూ పెట్టిన షరతులకు తోడు ఇ-కెవైసి వంటి వాటిని అదనంగా జోడించడంతో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ఏరివేతకు గురవుతున్నారు. పథకానికి నమోదు చేసుకున్న రైతుల్లో 33 లక్షల మందికి ఇంకా కిందటి కిస్తు పడలేదు. అంతకుముందు లబ్ధిదారులతో పోల్చుకుంటే 19 లక్షల మందికి కోత పడింది. కాగా ఇ-కెవైసి పూర్తి కాలేదన్న పేరిట డిసెంబర్-మార్చి కిస్తును రైతుల బ్యాంక్ అకౌంట్లలో కేంద్రం జమ చేయలేదు. త్వరలో కేంద్ర బడ్జెట్ వస్తుండగా గడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాల్సిన మూడవ కిస్తు జమ పడకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇ-కెవైసి గడువును పలుమార్లు పెంచుతూ పోగా శనివారం (జనవరి 28)తో ప్రస్తుత తుది గడువు ముగిసింది. రిజిస్టరైన లబ్ధిదారుల్లో 70 శాతానికే ఇ-కెవైసి పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ఇంకా 30 శాతం లబ్ధిదారుల ఇ-కెవైసి పెండింగ్‌లో ఉందని సమాచారం.
45 శాతమే !
గత సార్వత్రిక ఎన్నికలకు ముంగిట మోడీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అంటూ పిఎం కిసాన్‌ను ప్రారంభించింది. ఏడాదిలో మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున రైతుల అకౌంట్లలో నేరుగా నగదు బదిలీ చేసే పథకమిది. సంవత్సరంలో మూడు విడతలను ఒక్కోదాన్ని నాలుగు మాసాల కింద వర్గీకరించారు. ఏప్రిల్-జులై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి. కాగా కేంద్రం విధిస్తున్న షరతులు లక్షలాది మంది రైతులను స్కీంకు దూరం చేస్తున్నాయి. సొంత భూమి యజమానుల కుటుంబానికి మూడు విడతల్లో కేంద్రం ఏడాదికి ఇచ్చేది రూ.6 వేలు. నెలకు రూ.500 పడుతుంది. కుటుంబంలో 5 గురు సభ్యులుంటే ఒక్కొక్కరికి పడది రూ.వంద. రోజుకు రూ.మూడున్నర లోపు. ఆ స్వల్ప సాయానికీ కేంద్రం రోజుకో షరతు పెడుతోంది. ఎపిలో 60,77,808 మంది పథకానికి నమోదు చేసుకోగా 2022-23లో తొలి కిస్తు (ఏప్రిల్-జులై) 46,62,768 మందికి జమ పడింది. రెండో కిస్తు (ఆగస్టు-నవంబర్) 27,55,285 మందికే ఇప్పటి వరకు జమ పడింది. రిజిస్టరైన వారిలో సుమారు 33 లక్షల మందికి పడలేదు. ముందటి కిస్తు పడ్డ వారిలో 19 లక్షల మందికి కోత పడింది. అంతకుముందు లబ్ధిదారుల్లో 20 లక్షల మంది తగ్గారు.
భరోసా పలచన
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా వ్యవసాయదారులకు రైతు భరోసా పథకాన్ని పిఎం కిసాన్‌తో కలిపి అమలు చేస్తోంది. రెండు పథకాలకూ కలిపి లబ్ధిదారులను రాష్ట్రమే నిర్ణయిస్తోంది. ఏడాదిలో రైతులకు మూడు విడతల్లో మొత్తం రూ.13,500 అందాలి. మేలో ఇచ్చే తొలి కిస్తు రూ.7,500లో రాష్ట్రం 5,500, కేంద్రం 2,000 ఇవ్వాలి. నవంబర్‌లో ఇచ్చే రెండవ కిస్తులో రాష్ట్రం 2 వేలు, కేంద్రం 2 వేలు ఇవ్వాలి. మూడవ కిస్తు 2 వేలనూ కేంద్రమే ఇస్తుంది. అందులో రాష్ట్ర వాటా లేదు. భూమిలేని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ కౌలు రైతులకు రాష్ట్రమే మొత్తం రూ.13,500 ఇస్తోంది. భూమి యజమానులకు రాష్ట్రం ఇచ్చే సాయం పడుతోంది తప్ప కేంద్రం ఇచ్చేది సకాలంలో పడట్లేదు. లక్షలాది మంది రైతులు కేంద్ర సాయం కోసం ఎదురు చూస్తున్నారు.










