ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం) : ఆగస్టు 9న 'క్విట్ ఇండియా' స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ నినాదంతో విశాఖలో తలపెట్టిన నిరసన కార్యక్రమాలను కార్మికులు జయప్రదం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో - కన్వీనర్ జె.అయోధ్యరామ్ పిలుపునిచ్చారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 902వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్ సింటర్ ప్లాంట్ విభాగం ప్రతినిధులు, విశ్రాంతి ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి అయోధ్యరామ్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన కొకింగ్ కోల్‌ను అదానీ గంగవరం పోర్టు నిర్బంధించడం దారుణమన్నారు. దేశంలో కార్పొరేట్ శక్తులు ప్రభుత్వ రంగ పరిశ్రమలను నిర్వీర్యం చేస్తున్న క్రమంలోనే ఇటువంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ నినాదంతో అదానీ పోర్టుపై పోరాటం సాగించాలని కోరారు. పోరాట కమిటీ నాయకులు వైటి.దాస్, విళ్లా రామ్మోహన్ కుమార్, వరసాల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. రానున్న కాలంలో ప్రజలు మోడీ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. దీక్షల్లో సింటర్ ప్లాంట్ విశ్రాంత కార్మికుడు రమణరావు, విభాగం కార్మికులు ఎ.శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, నారాయణరావు, కె.బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.










