Jul 27,2023 15:32

ప్రజాశక్తి-ఎచెర్ల (శ్రీకాకుళం) : రాష్ట్ర ప్రభుత్వం టిటిడి అటవీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు డిమాండ్‌ చేశారు. 1000 రోజులుగా దీక్షలు నిర్వహిస్తూ పోరాడుతున్న టిటిడి అటవీ కార్మికులకు మద్దతుగా సిఐటియ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఎచ్చర్ల మండల కేంద్రంలో సిఐటియు జిల్లా నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తేజేశ్వరరావు మాట్లాడుతూ.. టిటిడి అటవీ కార్మికులు కేవలం 200 మంది గత 3సంవత్సరాలుగా అనేక ఒడిదుడుకులను, ఆటంకాలను, వరదలు, వర్షాలను కరోనా లాంటి విషమ పరిస్థితులను సైతం ఎదుర్కొని ఈ నిరసన కార్యక్రమం కార్మికులు సాగిస్తున్నారన్నారు. న్యాయమైన కోర్కెల గురించి టిటిడి యాజమాన్యం పట్టించుకోకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కోర్టులు ఆదేశించినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన సందర్భంగా టిటిడిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులందరినీ 24 గంటల్లో రెగ్యులరైజ్‌ చేస్తానని హామీ ఇచ్చారని, ఈ హామీ ఇచ్చి ఒకటిన్నర సంవత్సరం అవుతుందని అయినా పట్టించుకున్న నాధుడు లేరని విమర్శించారు. 2019వ సంవత్సరంలో స్వయంగా టిటిడి బోర్డు అటవీ కార్మికులందరికీ టైం స్కేల్‌ ఇస్తున్నామని తీర్మానం చేసిందని, నేటి వరకు అమలు చేయలేదని విమర్శించారు.టీటీడీ అటవీ విభాగంలో మొత్తం 362 మంది కార్మికులు పనిచేస్తుంటే ఇందులో 162 మందిని పర్మినెంట్‌ చేసి మిగిలిన రెండు వందల మంది కార్మికులకు టైం స్కేల్‌ కూడా కూడా ఇవ్వకుండా కార్పొరేషన్‌లో ఏకపక్షంగా కలిపేశారని విమర్శించారు. కార్పొరేషన్‌లో కలప వద్దు, టైం స్కేల్‌ కొనసాగించండని రాష్ట్ర హైకోర్టు ఆదేశం ఇచ్చినప్పటికీ టిటిడి పెద్దలకు కనికరం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల పట్ల టిటిడి యాజమాన్యం ఇంత కఠినంగా, అధర్మంగా, అన్యాయంగా ఎందుకు ప్రవర్తిస్తున్నదో సమాధానం లేదని అన్నారు. ధార్మిక క్షేత్రంలో ఇలా ప్రవర్తించడం న్యాయమా అని ఆయన ప్రశ్నించారు.ఈ న్యాయమైన టిటిడి పేద కార్మికుల పోరాటానికి ప్రతీ ఒక్కరూ సంఘీభావం తెలియజేయాలని పిలుపునిచ్చారు. టీటీడీ కార్మికులు ఒంటరిగా లేరని శ్రీకాకుళం జిల్లా కార్మికవర్గం యావత్తు వారి పోరాటానికి అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి యన్‌.వి.రమణ, ఎచ్చెర్ల మండల నాయకులు డి.బంగారురాజు, టి.రామారావు, ఏపీ బీసీఎల్‌ హమాలిస్‌ యూనియన్‌ నాయకులు జి.శ్రీనివాసరావు, రాము, గోవిందు శ్యామ్‌ క్రగ్‌ పిస్టన్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్లాంట్‌ -3 నాయకులు ఎం.సూర్యనారాయణ, పి.శ్రీనుబాబు, కే.సంతోష్‌ కుమార్‌, పి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు