ప్రజాశక్తి - కడప అర్బన్ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప బిఎస్‌ఎన్‌ఎల్ జిఎం కార్యాలయం ఎదుట బిఎస్‌ఎన్‌ఎల్ పెన్షనర్లు సోమవారం నిరసన తెలిపారు. పెన్షన్ రివిజన్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎఐబిడిపిఎ, ఎస్‌ఎన్‌పిడబ్ల్యుఎ జిల్లా కార్యదర్శులు కళ్యా సుధాకర్, ఒ. రెడ్డప్ప మాట్లాడారు. పెన్షన్ సవరణ చేయాలని, 1-1-2017 నుంచి 15శాతం ఫిట్‌మెంట్‌తో పెన్షన్ సవరణ చేయాలని, అందుకు సంబంధించిన ఫైల్‌ను టెలికం సెక్రటరీ నుంచి వెంటనే సంబంధిత మంత్రికి పంపాలని డిమాండ్ చేశారు.. సమస్యల పరిష్కారం కోసం వచ్చే 21 నుంచి 25 వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్షులు సుబ్బారెడ్డి, కొండన్న, ఈశ్వరయ్య, బాష, దస్తగిరి, పెన్షనర్లు పాల్గొన్నారు.










