Sep 13,2023 20:43
  • కుప్పంలో బయటపడ్డ అధికార పార్టీ విభేదాలు

ప్రజాశక్తి - శాంతిపురం (చిత్తూరు) : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం మొరసనపల్లి వద్ద నిరసన సెగ తగిలింది. రూ. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మండల కన్వీనర్‌ బుల్లెట్‌ దండపాణి ఆక్రమించుకున్నారని అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌ జగదీష్‌, ఎంపిటిసి సభ్యులు ఆర్ముగం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వారం రోజులుగా ఈ సమస్యపై రెవెన్యూ అధికారులకు, కుప్పం ఇన్‌ఛార్జి ఎమ్మెల్సీ భరత్‌కు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోవడంతో ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు మొరసనపల్లి పంచాయతీ మహిళలు రోడ్డుపై బైఠాయించారు. మంత్రితో మాట్లాడే అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్సీ భరత్‌ తెలపడంతో నిరసన విరమించారు. అయితే, మంత్రి కాన్వాయ్ ఆగకుండా వెళ్లిపోవడంతో ఆగ్రహించిన సర్పంచ్‌, ఎంపిటిసి సభ్యులు ప్రజలతో కలిసి మరోసారి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రాళ్లబూదూగూరు ఎస్‌ఐ అక్కడకు చేరుకుని తిరుగు ప్రయాణంలో మంత్రితో మాట్లాడే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి నిరసన విరమింపజేశారు. అనంతరం తిరుగు ప్రయాణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొరసనపల్లి పంచాయతీ సర్పంచ్‌, ఎంపిటిసి సభ్యులతో మాట్లాడారు. రూ. కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని బుల్లెట్‌ దండపాణి, రామచంద్రన్‌ ఆక్రమించుకుని భవనాలు నిర్మిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ స్థలాన్ని ప్రజా అవసరాలకు వినియోగించుకునేందుకు కేటాయించాలని కోరారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కుప్పం ఆర్‌డిఒ, రెవెన్యూ అధికారులకు మంత్రి సూచించారు. ఏదిఏమైనా ఈ ఘటన కుప్పంలోని రెండు గ్రూపుల విభేదాలను బహిర్గతం చేసింది.