Sep 11,2023 20:37
  •  బంద్‌లోచంద్రబాబు డెయిరీ మూయలేదు

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : టిడిపి బంద్‌కు పిలుపు ఇస్తే చంద్రబాబు సొంత డెయిరీ హెరిటేజ్‌ కూడా మూతపడలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు సొంత గ్రామంలోనూ షాపులు తెరిచే ఉన్నాయన్నారు. తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పు చేయలేదని లాయర్లు, టిడిపి నాయకులు మాట్లాడడం లేదని, 24 గంటలు దాటాక కోర్టులో ప్రవేశపెట్టారని, గవర్నర్‌ అనుమతి తీసుకోలేదనే టెక్నికల్‌ పాయింట్స్‌ మాట్లాడుతున్నారని తెలిపారు. మూడు రాజధానుల బిల్లు, ఇంగ్లీష్‌ మీడియం, ఇళ్లపట్టాలపై స్టే తెచ్చారని, ప్రభుత్వ కార్యక్రమాలకు కోర్టులో స్టే తెస్తే అది సక్రమం, చంద్రబాబును అరెస్టు చేస్తే అది అక్రమమా? అని ప్రశ్నించారు. గతంలో చిదంబరం ద్వారా సిఎం జగన్‌ను అక్రమంగా జైలుకు పంపారని ఆరోపించారు. ఒక్కరోజు చంద్రబాబు జైల్లో ఉంటే విలవిలలాడుతున్నారన్నారు. కేబినెట్‌ సబ్‌కమిటీలో అనేక అంశాల్లో అవినీతిపై రిపోర్టు ఇచ్చామని, త్వరలోనే అవన్నీ బయటకు వస్తాయని చెప్పారు. పవన్‌కల్యాణ్‌ ఆరోపణలపైనా విచారణ చేయాలని కోరుతామని, అబద్దాలని రుజువైతే పరువు నష్టం దావా వేస్తామని వివరించారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, ఇలాంటి కేసులు చాలా ఎదుర్కోవాలని అన్నారు. చంద్రబాబు అరెస్టుకు తాము సంతోషపడటం లేదని, ఎవరైనా సంతోషించారంటే అది ఎన్‌టి రామారావు ఆత్మ మాత్రమేనని చెప్పారు.