Aug 01,2023 21:18
  •  హోంమంత్రి అమిత్‌షాకు రామచంద్రయాదవ్‌ ఫిర్యాదు

ప్రజాశక్తి - పుంగనూరు (చిత్తూరు) : నాలుగేళ్లలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారని, ఇడి, సిబిఐతో దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్‌ కోరారు. ఈ మేరకు ఢిల్లీలో అమిత్‌ షాను కలిసి పెద్దిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. సూట్‌కేసు కంపెనీలు, భూకబ్జాలు, బినామీపేరిట ఆస్తులు కొట్టేయడం, ప్రాజెక్టుల నుంచి కమీషన్లు తీసుకోవడం, ఖాతాలను తారుమారు చేయడం, లిక్కర్‌స్కామ్‌లు ఇలా అనేక ఆర్థిక నేరాల్లో మంత్రి పెద్దిరెడ్డి ఆరితేరిపోయారని ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువులు, కుటుంబసభ్యులు ఇలా మొత్తం 17 మంది డైరెక్టర్ల పేరిట 61 కంపెనీలు ఉన్నాయని, ఇవన్నీ మరో 50 కంపెనీలతో లింక్‌ అయ్యాయని తెలిపారు. వీటి ద్వారా రూ. 35 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌, లిక్కర్‌ స్కామ్‌లు, అక్రమ మార్గాల్లో కాంట్రాక్టులు పొందడం, నిబంధనలు పాటించకపోవడం, ఖనిజ సంపదను అక్రమంగా దోచుకోవడం ద్వారా వేలాది కోట్లు కొల్లగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి పెద్దిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించేలా న్యాయ పోరాటం చేస్తామన్నారు.