ప్రజాశక్తి-విజయవాడ : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఏపీ సీఐడీ డీజీ సంజయ్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబును ఈరోజు ఉదయం 6 గంటలకు నంద్యాలలో ఆర్కే ఫంక్షన్ హాల్ నుంచి సీఐడీ బృందం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌లో రూ. 550 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పారు. ప్రభుత్వానికి రూ.371 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని తెలిపారు. చంద్రబాబుకు అన్ని లావాదేవీల గురించి తెలుసునని అన్నారు. ఈ కేసుకు సంబంధించి కీలక పత్రాలను మాయం చేశారని.. ఈ స్కామ్‌లో బెనిఫిషియరీ కూడా చంద్రబాబేనని అన్నారు. ఈ కేసు దర్యాప్తులో చంద్రబాబు నాయుడే ప్రధాన నిందుతుడని తేలిందని చెప్పారు. చంద్రబాబును కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈడీ, జీఎస్టీలు కూడా ఇప్పటికే ఈ కేసును విచారించాయని తెలిపారు. ఈ కేసులో నారా లోకేశ్ ను కూడా ప్రశ్నించాల్సి ఉందని చెప్పారు. నిధులు కాజేసేందుకే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండానే కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. గంటా సుబ్బారావును కార్పొరేషన్ ఎండీ, సీఈవోగా నియమించారని తెలిపారు. ఆయనకు నాలుగు పదవులు కట్టబెట్టారని అన్నారు. ఈడీ, జీఎస్టీ సంస్థలు కూడా దీనిపై విచారణ జరిపాయని చెప్పారు. నకిలీ ఇన్ వాయిస్ ల ఆధారంగా నగదు బదిలీ చేశారని తెలిపారు. న్యాయ పరంగా అన్ని చర్యలు తీసుకునే చంద్రబాబును అరెస్ట్ చేశామని తెలిపారు. అన్ని వివరాలు బయటకు రావాలంటే చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పదని అన్నారు. ఈ కేసులోని ఇతర నిందితులు దుబాయ్, యూఎస్ లలో ఉన్నారని... వారిని అక్కడి నుంచి తీసుకురావడానికి ఆయా దేశాలకు అధికారులు వెళ్తారని చెప్పారు.