
రాష్ట్రంలో అసమానవతలకు సిపిఎం ప్రత్యామ్నాయ విధానమే పరిష్కారం
సిపిఎం రాష్ట్ర ప్రజా రక్షణ భేరి బస్సుయాత్ర ఆదివారం ఉదయం 11.30 గంటలకు అనకాపల్లి చేరుకున్న సందర్భంగా ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద పెద్దఎత్తున ప్రజలు పూలుజల్లి స్వాగతం తెలిపారు. అనంతరం ఆర్టీసి కాంపెక్స్ నుండి నాలుగు రోడ్లు జంక్షన్ (వైజాగ్ బస్సుస్టాప్) వద్ద ఏర్పాటు చేసిన సభ సిపిఎం అనకాపల్లి మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సభను ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం మాట్లాడుతూ తొమ్మిదిన్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని బిజేపి అన్ని విధాలా అన్యాయం చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మౌనం దాల్చుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అనకాపల్లి జిల్లాను ఏర్పాటు చేసినా ఏం లాభమని ఏ ప్రభుత్వ కార్యాలయం ఎక్కడ వుందో ఎవ్వరికీ అర్థంకాని పరిస్థితి నెలకొన్నదని అన్నారు. నిత్యావసర సరకుల ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారని దేశ ప్రధాని మోడీ అటు అదానీ, ఇటు అంబానీలకు లాభం చేస్తూ రాష్ట్రాల హక్కులపై దాడి చేస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదన్నారు. సిపిఎం చెబుతున్న ప్రత్యామ్నాయ విధానం అమలు చేస్తే విద్యుత్ యూనిట్‌ను ఒక్కరూపాయికి, గ్యాస్ రూ.400లకు, పెట్రోల్ 60లకే ఇవ్వొచ్చని జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే కేరళ తరహా విధానం అమలు చేయాలన్నారు. దేశం, రాష్ట్రంలో ప్రజల సంపదలను లూటీచేస్తున్న పలువురు ఎంపీలు, ఎంఎల్‌ఏలకే జీవితకాలం పెన్షన్, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలున్నాయని ఆయన ఆవేదన చెందారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె ధనలక్ష్మి, ఎం.హరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర బిజెపి ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తుతూ వెళ్తోందని ఆ బంధం తెచ్చుకుని రాకపోతే రాష్ట్రం అసమానతలతో నాశనం అవుతుందున్నారు. 60ఏళ్లు ఉపాధ్యాయులుగా సేవలందించిన టీచర్లకు పెన్షన్ గ్యారెంటీకి జగన్ ప్రభుత్వం 2019 ఎన్నికల ముందు హామీ ఇచ్చి నేడు సిపిఎస్ అంటూ పాతరాగం ఎత్తుకోవడం మోసపూరితమన్నారు. అలాగే స్కీం వర్కర్లకు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే 2024 ఎన్నికల్లో ప్రజలు బటట్ నొక్కి ఓడిస్తారని హెచ్చరించారు. అనకాపల్లి ` అచ్యుతాపురం రోడ్డు అడిగినా నాలుగేళ్లుగా వేయలేని స్థితిలో జగన్ ప్రభుత్వం పడిరదని స్థానిక ప్రజలు బస్సు బృందం వద్ద వినతిపత్రం అందజేశారు. అచ్యుతాపురంలో వందల సంఖ్యలో మహిళలు బస్సు బృందానికి స్వాగతం పలికారు. జిల్లాలో నెలకొన్న పలు సమస్యలను, కార్మికులు, కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు గారికి ప్రజలు వినతిపత్రాలు అందజేయారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి కోటేశ్వరరావు, డి వెంకన్న, జిల్లా కమిటీ సభ్యులు ఆర్.శంకరావు, వి.వి.శ్రీనివాసరావు, అల్లు రాజు, గనిశెట్టి సత్యన్నారాయణ, సిపిఎం సీనియర్ నాయకులు ఎ.బాలకృష్ణ, జి.నాయనబాబు, వై.దేముడు, దేముడునాయుడు, నరసింహమూర్తి, నాయుడు, బి.ఉమామహేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
******************************************************
కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న నిర్వాసిత గ్రామాలకు రక్షణ కల్పించాలి : కె. లోకనాథం
అచ్చుతాపురం : అసమానతలు లేని అభివృద్ధి కోసం ప్రజారక్షణ బేరి బస్సు యాత్ర ఈరోజు అచ్చుతాపురం చేరుకుంది. రైతు బజార్ నుండి అచ్చుతాపురం వరకు కళాకారులు కోలాటంతో జాతా నాయకులకు పూలు చల్లి హారతి ఇచ్చి బొట్లు పెట్టి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్. రాము అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. లోకనాథం, రాష్ట్ర కమిటీ సభ్యురాలు, కె. ధనలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవంబరు 15న ప్రజారక్షణ భేరి పేరుతో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి ముందు మూడు ప్రాంతాల నుంచి బస్సు యాత్రలు బయలుదేరాయని, శ్రీకాకుళం జిల్లా మందస నుండి నవంబర్ 2న ప్రారంభమైన బస్సు యాత్ర ఈరోజు అచ్చుతాపురం చేరుకుందని అన్నారు. అచ్చుతాపురంలో గుంతల పడిన రోడ్డును పరిశీలించి నిరసన తెలియజేసి అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించి నిర్వాసితులకు న్యాయం చేయాలని కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న నిర్వాసిత గ్రామాలకు రక్షణ కల్పించి పరిశ్రమ మధ్యలో ఉన్న చిన్నపూడి ,చిన్నతాల్ దిబ్బ, దుప్పుతురు గ్రామాలను తరలించాలని కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించాలని కోరారు.
విభజన హామీలను అమలు చేయాల్సిన కేంద్ర బిజెపి ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు చేయకుండా రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేస్తోంది. ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కు ఫాక్టరీ, రామాయపట్నం మేజర్ పోర్టు, రాజధాని నిర్మాణం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటు, కడప ఉక్కు, రైల్వే జోన్ వంటి విభజన హామీలలో ఏ ఒక్కటీ అమలు కాలేదు. రాష్ట్ర ప్రజల్ని నిలువునా మోసం చేసిన బిజెపి అంతటితో ఆగకుండా మన రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి గుండెకాయలాంటి విశాఖ ఉక్కును తెగనమ్మడానికి తయారైంది.
బిజెపి పాలనలో మొత్తం దేశమే అస్తవ్యస్తంగా తయారైంది. బిజెపి బుల్‌డోజర్ రాజకీయాలతో అన్నదమ్ముల్లా సమైక్యంగా మెలగవలసిన ప్రజలమధ్య విద్వేషాలు రాజేస్తోంది. కోట్లాదిమంది కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్ లను తెచ్చింది. దేశీయ వ్యవసాయానికి, ప్రజల ఆహార భద్రతకు ముప్పు తెచ్చే నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చింది. రైతులు సాగించిన పోరాటం మీద తీవ్ర దమన కాండను ప్రయోగించింది. అయినా వెన్ను చూపని రైతన్నల పోరాట తెగువకు తలొగ్గి చివరికి ఆ చట్టాలను రద్దు చేసింది. కాని ఆ సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి రైతన్నలకు ద్రోహం చేస్తోంది. తాను కూడా ఏమాత్రమూ తీసిపోనంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కార్పొరేట్ సేవలో తరిస్తున్నారు. కృష్ట పట్నం, గంగవరం మేజర్ పోర్టులతో బాటు రాష్ట్ర ప్రజల సంపదను ఒక్కొక్కటిగా అదానీకి నైవేద్యం పెడుతున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసి విభజన హామీలకు ఎసరు పెట్టినా కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనడంలేదు. కేంద్రం చెప్పినట్టల్లా తలాడిస్తూ ప్రజలమీద మోయలేని భారాలను వడ్డిస్తున్నాడు. విద్యుత్ చార్జీల పెనుభారం ప్రజలపై రుద్దతున్నారు. స్మార్ట్ మీటర్లపేర, మోటార్లకు మీటర్లు పేరుతో, ఆస్తిపన్ను నుంచి చెత్త పన్ను దాకా అన్నీ వడ్డింపులలో ప్రజలపై భారాలు మోపుతున్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వాలను నిలదీయడానికి సిపిఎం ప్రజా రక్షణ భేరి మోగిస్తోంది. విజయవాడలో ఈ నెల 15న జరిగే బహిరంగ సభలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏవి నాగేశ్వరరావు, ఎం హరిబాబు, బి ప్రభావతి ,అనకాపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి కోటేశ్వరరావు, సిపిఎం సీనియర్ నాయకులు కర్రి అప్పారావు ,రాంబిల్లి మండల కన్వీనర్ జి దేవనాయుడు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గనిసెట్టి సత్యనారాయణ, అచ్చుతాపురం సిపిఎం నాయకులు కె. సోమ నాయుడు, కె. రామసదేశ్వర, చౌడేపల్లి అప్పారావు, బుద్ధ రంగారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

