పక్కవాడి ప్రతిభను
మనసారా మెచ్చుకోలేని
మానసిక అవిటితనంతో
మేధావులు బాధపడుతున్నారు
ప్రాంతీయత ప్రతిభను వెక్కిరిస్తోంది
కులం, వర్గం, రాజకీయం ముందు
మోకరిల్లుతోంది
నిరసనలు, నినాదాలు రాజీపడ్తున్నాయి
ఉద్యమాలు నిర్బంధంలో నీరసపడి
పక్కదారి పడ్తున్నాయి
సాహిత్య కారులు అనధికార
శాసన కర్తలన్నదెవరు?
వారు పాలకపక్షానికి స్వామి భక్తులు!
నోరు నవ్వుతోంది
నొసలు వెక్కిరిస్తోంది
ప్రొఫెషనల్ జలసీ కంటికి కన్పించదు
ప్రొఫెసర్లైనా ఇందుకు మినహాయింపు కాదు
తన దాకా వేస్తే అందరూ మార్క్స్
మేనమామలే
అంబేడ్కర్‌కు అన్నదమ్ములే!
చింతించకు కవీ!
ఓట్ల రాజకీయంలో ప్రతిభా మూర్తులంతా
నిరాయుధులూ, నిస్సహాయులే
అవకాశవాదులంతా పాలక వర్గానికి
దగ్గరి చుట్టాలే!
సొంత లాభమే సేవా భావమైన చోట
పట్టు విద్యా ప్రవీణులకే అవార్డులైనా రివార్డులైనా
'నీ వాణ్ణే నువు తిట్టకపోతే తెలుగు వాడివే కాదు'
అపు డెప్పుడో కొసరాజు రాసిన పాట
గుర్తుకొస్తోంది నాకు.
- డా.రాధేయ










