ప్రజాశక్తి - పాడేరు ఏజెన్సీ విలేకర్ల బృందం : పాడేరు ఏజెన్సీలో గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ చేపట్టిన రిలే దీక్షల భగంపై ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం, ఇతర ప్రజా సంఘాల నేతలు బుధవారం చేపట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. పాడేరు పట్టణంలో విద్యా సంస్థలు మూతపడ్డాయి. ప్రయివేటు విద్యా సంస్థల్లో ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతున్న కళాశాలల విద్యార్థులకు బంద్ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కె రాధాకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల మరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని, హెల్త్ అసిస్టెంట్ల నియామకం, డిగ్రీ, ఇంటర్ ఎగ్జామినేషన్ ఫీజులు ఐటిడిఎ చెల్లించాలని డిమాండ్ చేశారు. అరకులోయలో బంద్ విజయవంతమైంది. మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. ముంచంగిపుట్టులో నాలుగు రోడ్ల కూడలి వద్ద ఐటిడిఎ పిఒ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. పెదబయలులో ర్యాలీ, మానవహారం చేపట్టారు. డుంబ్రిగుడ మండలంలో బంద్ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.











