ప్రజాశక్తి - బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా) : తాము సాగుచేసుకుంటున్న ఎల్‌టిఆర్, 1/70, పోడుభూములకు పట్టాలివ్వాలని ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కెఆర్‌పురం ఐటిడిఎ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం గిరిజనులు ఈ కార్యక్రమం చేపట్టారు. గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడారు. తరతరాలుగా గిరిజనులు సాగుచేస్తున్న ఎల్‌టిఆర్, 1/70, పోడు భూములకు పట్టాలివ్వాలని అనేక ఆందోళనలు చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదన్నారు. కౌలు చేస్తున్న గిరిజనేతరుల పేర్లను మాత్రం అడంగల్‌లో నమోదు చేయడం దుర్మార్గమన్నారు. గిరిజనేతరులకు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చే అధికారం ఆర్‌డిఒకు లేదని చెప్పిన వారే అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. మర్లగూడెంలో గిరిజనులు సాగుచేస్తున్న భూములకు ఆర్‌డిఒ ప్రొటెక్షన్ ఇవ్వడం, వాటి ఆధారంగా గిరిజనేతరులు పోలీసుల సమక్షంలో గిరిజనులపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. గిరిజనేతరులకు జీలుగుమిల్లి తహశీల్దార్ తప్పుడు ప్రొటెక్షన్ ఇస్తున్నారని విమర్శించారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐటిడిఎ పిఒ ఎం.సూర్యతేజకు వినతపత్రాన్ని అందించారు. సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో పర్యటించి గిరిజనులకు న్యాయం చేస్తానని పిఒ హామీఇచ్చారు.










