స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ మానుకోవాలి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు మారాలి : మాజీ ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ

ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే చర్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని మాజీ ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ ప్రైవేటీకరణకు బదులుగా ప్లాంటుకు సొంత గనులు కేటాయించి, పూర్తి సామర్ధ్యంతో నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి, సమర్థులైన యాజమాన్యాన్ని నియమించి, పూర్తి సామర్థ్యంతో అన్ని బ్లాస్ట్ ఫర్నేస్‌లు నడిచేలా కేంద్రం ఆర్థిక సాయం చేయాలన్నారు. ప్లాంట్ సామర్థ్యాన్ని మూడు మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్ టన్నులకు కార్మికులు పెంచిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం ప్లాంట్‌లోని మూడు ఫర్నేస్‌లలో ఒకటి మాత్రమే పూర్తి సామర్థ్యంతో పనిచేయి స్తున్నారని, మిగతా రెండింటిలో ఒకటి పాక్షికంగా, మరోకటి మూసివేశారని తెలిపారు. దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ మూసివేత ఫలితంగా ప్లాంట్ తన సామర్థ్యంలో మూడోవంతు మాత్రమే పనిచేస్తోందన్నారు. 20.63 మిలియన్ టన్నుల ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్లాంట్ కలిగి ఉందన్నారు. 2030-31 నాటికి దీన్ని 35 మిలియన్ టన్నులకు పెంచాలన్న లక్ష్యం ఉందని, దీనికి పెట్టుబడి రూ.లక్ష కోట్ల వరకూ ఉండొచ్చని సెయిల్ సూచించిందని తెలిపారు. ఏడాదికి పైగా ఉక్కు కార్మికులు అకుంఠిత దీక్షతో చేస్తున్న ఉద్యమానికి ఆయన సంఘీభావం తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే పనులు ఇకనైనా మానుకోవాలన్నారు.
గంగవరం పోర్టును వదిలేశారా ?
విశాఖ స్టీల్ ప్లాంటు దేశంలోనే సముద్రతీరంలో ఉన్న ఏకైక ఉక్కు పరిశ్రమ అని, అటువంటి ప్లాంటుకు పనిలేకుండా ఉంచడం తీవ్రంగా పరిగణించాలని అన్నారు. వర్కింగ్ క్యాపిటల్, క్యాప్టివ్ మైనింగ్ అన్నది రెండు సమస్యలను నేడు స్టీల్‌ప్లాంట్ ఎదుర్కొంటోంద న్నారు.
గంగవరం పోర్టును ఆదానీకి రాష్ట్ర ప్రభుత్వ తన 11శాతం వాటాను వదిలిపెట్టడానికీ, నేడు స్టీల్‌ప్లాంట్‌ను అదే కార్పొరేట్‌కి కట్టబెట్టడానికి ఉన్న లింకు ఇప్పుడు అర్థమవుతోందని తెలిపారు. ప్లాంట్‌లోని స్థలంలో అత్యంత భారీ రాయితీ ధరకి ఓ ప్రైవేట్ గ్రూప్‌నకు అప్పట్లో కట్టబెట్టేశారని చెప్పారు. ప్రైవేటు సంస్థలకు లాభం చేకూర్చే ఈ తరహా విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలన్నారు.