
సెప్టెంబర్ 24న దేశంలో 11 రాష్ట్రాలను కలుపుతూ తొమ్మిది ''వందే భారత్'' రైళ్లను ప్రధాని మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. అందులో మన రాష్ట్రంలో విజయవాడ-చెన్నై మధ్య ఒక రైలుండటం సంతోషం. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ రైల్వేల ఆధునీకరణకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. రైల్వేల్ని ఆధునీకరించాల్సిందే. తక్కువ సమయంలో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ప్రజలకు అందిస్తానంటే ఎవరు వద్దంటారు!? మరి వందేభారత్ రైలులో అన్ రిజర్వ్‌డ్ కంపార్ట్‌మెంట్లు ఎన్ని? మధ్యతరగతి ప్రయాణించే స్లీపర్ కోచ్‌లు ఎన్ని? ఒక్కటీ లేదు. ఎవరి కోసమీ ''వందే భారత్''లు? డబ్బు పెట్టి ప్రయాణించగలిగే వారి కోసమా? పేద, మధ్యతరగతి వారి కోసమా? భారత రైల్వేల ప్రధానోద్దేశానికే తూట్లు పొడవడం తప్ప మరోటి కానే కాదు.
సామాన్య మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండే ధరల్లో, సౌకర్యవంతంగా ''గరీబ్ రథ్'' లాంటి రైళ్లను నడిపితే కొంతలో కొంతైనా ప్రయోజనమేగదా! వందేభారత్‌లో విజయవాడ-చెన్నై టిక్కెట్టు చార్జి రూ.1,185. ఎగ్జిక్యూటివ్‌లో అయితే రూ. 2,140. మరి పినాకిని ఎక్స్‌ప్రెస్ ఏసీ చైర్ కారుకు రూ.625, ఆర్డినరీ సీట్‌లో రూ.180. సామాన్య, మధ్యతరగతి ప్రయాణించేలా పినాకినిలో ధరలుంటే వందే భారత్‌లో ప్రయాణం ఉన్నత శ్రేణిలో ఉన్న వారికే వీలవుతుందనేది వాస్తవం.
- ఆధునీకరణ బాధ్యత లోపం ఎవరిది?
ఈ సంవత్సరం జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ రైలు దుర్ఘటన 3 దశాబ్దాల తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదం. 300 మంది అమాయక ప్రయాణికులు చనిపోయారు. 2 వేల మంది గాయపడ్డారు. ఎవరు దీనికి బాధ్యులు? రైల్వేల ఆధునీకరణకు నిధులివ్వని కేంద్ర ప్రభుత్వం కాదా?
ఈ తొమ్మిదేళ్లలో రైలు ప్రయాణించే దూరం 125 శాతం, ప్రయాణికుల సంఖ్య 146 శాతం పెరిగింది. రైల్వే వేగం పెరిగింది. కానీ కార్మిక-ఉద్యోగుల సంఖ్య తదనుగుణంగా పెరగకపోగా 20 లక్షల నుండి 12.50 లక్షలకు తగ్గింది. సిబ్బందిపై పని భారం పెరిగింది. రైళ్ల వేగానికి అనుగుణంగా ట్రాక్స్ ఆధునీకరణ జరగలేదు. రైల్వే ట్రాక్‌ల నిర్వహణ కోసం 1990లోనే 4 లక్షల మంది సిబ్బంది ఉంటే...రైళ్ల సంఖ్య, వేగం పెరిగిన నేటి పరిస్థితిలో సిబ్బందిని 2 లక్షలకే కుదించారు. సిబ్బందిని పెంచక పోగా కుదింపు ప్రజా భద్రతకా? ప్రమాదాలు పెరగడానికా? రైల్వేల భద్రత కోసం ఏర్పరచిన ''రాష్ట్రీయ రైల్ సంరక్షణ కోష్'' (ఆర్.ఆర్.ఎస్.కె)కు ప్రతి ఏటా రూ.20 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వుండగా భద్రతకు మోడీ ఇచ్చింది ఈ ఆరు సంవత్సరాల్లో రూ.3,300 కోట్లే. రైలు ప్రమాదాలు జరగకుండా రైలింజన్‌కు అమర్చే భద్రతా యంత్రం 'కవచ్'ను 2022 మార్చి నాటికి 65 ఇంజన్లకు మాత్రమే అమర్చారు. అంటే మోడీ గారి ఆధుణీకరణ ఉవాచ నిజమేనా? ప్రజల్ని మభ్య పెట్టడానికి తప్ప!
మోడీ హయాంలో రైల్ యాక్సిడెంట్లు పెరుగు తున్నాయి. 2021-2022 సంవత్సరంలో 22 జరిగితే, 2022-23లో 48 జరిగాయి. లెవెల్ క్రాసింగులు, సిగల్ పాయింట్లు, ట్రాక్ నిర్వహణ, రైల్వే బ్రిడ్జీల ఆధునీకరణ, సిబ్బంది పెంపు మొదలైన భద్రతా చర్యలకు ప్రాధాన్యత ఏది? పైగా ఆధునీకరణ కోసం నిధులు కావాలంటే ప్రైవేటీకరణే శరణ్యమని మోడీ సెలవిస్తున్నారు. 2014 నుండి 2023 వరకూ ఎంత మంది ప్రైవేట్ వ్యక్తులు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రైల్వేలో పెట్టారో కేంద్రం చెప్పగలదా?!
- సామాజిక బాధ్యతలో భారత రైల్వే
రైల్వేల స్థాపనలో ప్రధానోద్దేశం చౌకగా రవాణా, ఎక్కువ సౌకర్యం, భద్రత, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఆస్తుల పునర్‌నిర్మాణం, తక్కువ కాలుష్యం, సమర్ధవంతమైన-భద్రతా సేవలందించడం. ఈ లక్ష్యాలను ప్రైవేటు వ్యక్తులు ఆరు నూరైనా ఇవ్వలేరు. ప్రైవేటు సంస్థల ప్రధాన ధ్యేయం లాభార్జనే తప్ప సమగ్ర ప్రజా సేవా దృక్పథóం ఉండదుగాక ఉండదు. 2020-21లో రైల్వేల రవాణా 124 కోట్ల టన్నులు (జాతీయ సరుకు రవాణాలో ఇది 30 శాతం). ప్రయాణీకుల సంఖ్య 808.60 కోట్లు. అంటే రోజుకు 2.50 కోట్ల మంది. రైల్వేకున్న భూమి 11 లక్షల ఎకరాలు. అందులో 2 లక్షల ఎకరాలు ఖాళీ స్థలాలు. వీటి విలువ పాత పుస్తక విలువ ప్రకారమే రూ.7 లక్షల కోట్లు. అంటే ప్రస్తుత ధరతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇంత విస్తారమైన సంపదపై కార్పొరేట్ల డేగ కన్ను పడింది. ఆ తోడేళ్లకు రైల్వేను బలివ్వడానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడిందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. రైల్వే ప్రయాణీకులకు రూ.100 టికెట్టుపై రూ.47 సబ్సిడీ ఇస్తున్నది. సరుకు రవాణా-ప్రైవేటు రవాణా కన్నా 60 శాతం తక్కువ. అంటే రైల్వేలో ప్రయాణ-వస్తు రవాణా అత్యంత చౌక అన్నమాట. ఇదికాక వృద్ధులు, వికలాంగులు, రోగులు, విద్యార్థులు, క్రీడాకారులు, రైతులు, మహిళలు, కళాకారులకు సీజనల్ టిక్కెట్ల ద్వారా, రాయితీలివ్వడమేకాక ఆఖరికి ప్రజా ప్రతినిధులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది.
రైల్వేలో 2019-20 లెక్కల ప్రకారం 2.60 లక్షల మంది దళితులు, 98 వేల మంది ఎస్టీ పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. తద్వారా సామాజిక న్యాయానికి రైల్వే కట్టుబడి కృషి చేస్తున్నది. ఈ సామాజిక బాధ్యతని ప్రైవేట్ సంస్థలు వహించగలవా? వృద్ధులు తదితరులకిచ్చే రాయితీలను ప్రైవేటువారి కోసమే కరోనా వంకతో రద్దు చేశారు మోడీ. మన ఎక్స్‌ప్రెస్ రైలు చార్జీలకు, వందేభారత్ రైలు ఛార్జీలు ఇతర ఏసీ ప్రయాణాల ధరలతో పోలిస్తే 2-3 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ భారం ప్రజలేగా మోయాల్సింది!
- నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్‌ఎంపి)
సామాజిక సేవా దృక్పథంతో పని చేస్తున్న రైల్వేలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడానికి సుతరామూ సిద్ధపడటం లేదు. కానీ ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులు లేదా రైల్వే ఆస్తులు మార్కెట్ రేటుకు కొనుగోలు చేయలేరని సులువైన విధానాన్ని అమలు జరుపుతున్నది. 2031 నాటికి మౌలిక వసతుల కోసం ఆదాయం సమకూర్చుకోవడానికి మొత్తం 8 రైల్వే యంత్రాలు, పరికరాలు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలను, 50 శాతం స్టేషన్లని, 68 వేల కిలోమీటర్ల ట్రాక్‌ని, 500 ప్రయాణీకుల రైళ్లను 12 క్లస్టర్ల ద్వారానూ, 300 గూడ్స్ షెడ్లను మోనిటైజేషన్ పేరుతో 35 నుండి 99 సంవత్సరాలకు దేశ, విదేశీ సంస్థలకు కేవలం నామమాత్రపు లీజుకివ్వడానికి పూనుకుంది. ఈ కార్పొరేట్లు పెట్టుబడి ఖర్చులివ్వరు. వారికి వచ్చే ఆదాయంలో వాటా మాత్రం అసలే ఇవ్వరు. ప్రయాణీకుల టిక్కెట్టు చార్జీలు, సరుకు రవాణా చార్జీల్ని వారి ఇష్టం వచ్చినట్లు నిర్ణయించుకోవచ్చు. అంటే రైల్వే సొమ్మేమో భారతీయులది. సోకు కార్పొరేట్లదన్నమాట. వీరు చౌకగా టికెట్ ధరలు నిర్ణయిస్తారా? దేశ ప్రజలకు చౌకగా, లాభదాయకంగా రైల్వేలను నడుపుతారా? భారత్ ప్రజలు, రైల్వే ఉద్యోగులు తీవ్రంగా ఆలోచించాలి. ప్రయాణ భద్రత ఇక ఎండమావే. ఇప్పటికే వందేభారత్ రైలు వెళ్లిన గంట వరకూ భారత్ రైళ్లు నడపడానికి వీల్లేదనే ఆంక్ష. ఇది ప్రైవేటు కాంక్షే తప్ప ప్రజా సౌకర్యం కోసం కాదని ఇట్టే అర్థమవుతోంది.
ప్రైవేట్ కంపెనీలకు రైల్వేలను అప్పజెప్పిన ఇంగ్లాండ్, అర్జంటీనా తదితర దేశాల అనుభవం చూస్తే... చార్జీలు 2-3 రెట్లు పెంచారు. సకాలంలో రైళ్లు నడవలేదు. యాక్సిడెంట్లు పెరిగాయి. లాభసాటిగా లేని అనేక స్టేషన్లు మూతపడ్డాయి. వివేక్ దేబ్రారు సిఫార్సు ప్రకారం 50 శాతం కూడా ఆదాయం రాని స్టేషన్లు మూసేస్తారు. రాబోయే కాలంలో గ్రామీణ ప్రాంత రైల్వే స్టేషన్లు ఖాయంగా మూతపడతాయి. ఆ ప్రజలకు రైలు రవాణా ఇక అందుబాటులో ఉండదు. ఖర్చు, కార్పొరేట్ లాభాలు కలుపుకొని చార్జీలు నిర్ణయించాలని సిఫార్సు చేసింది. ఇది దేశ ప్రజల ప్రయోజనాల కన్నా కార్పొరేట్ల లాభాలు, ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వడమే.
ఒకటి, రెండు ఉదాహరణలను పరిశీలిస్తే.. వందే భారత్ రైలు చార్జీలను, ఇతర ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో రైలు చార్జీలకు తేడా రెండు, మూడింతలుంది. వందేభారత్ రైలు ఇంజిన్లను బీహార్‌లోని మధెపురా రైల్వే కర్మాగారం రూ. 11.5 కోట్లకు నిర్మిస్తే అదే సాంకేతిక పరిజ్ఞానరతో జర్మనీ సీమెన్స్ కంపెనీ నుండి రూ. 20 కోట్ల ఖరీదుకు కేంద్ర ప్రభుత్వం కొనడానికి ఒప్పందం చేసుకుందంటే లాభం ఎవరికి? నష్టం మాత్రం ప్రజలకు. వందేభారత్ కోచ్‌లను 18 మాసాల్లో చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2018 లోనే 160 కి.మీ వేగంతో ప్రయాణించే దానిని ''ట్రైన్ 18'' పేరున రూ. 98 కోట్లకు తయారు చేసింది. మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ యు.పి.లో రాయబరేలీలో 1000 ఎల్‌హెచ్‌బి కోచ్‌లు తయారుచేసే సామర్ధ్యం ఉంటే దానిలో 150 కన్నా ఎక్కువ ఉత్పత్తి చెయ్యరాదని రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీజేసిందంటే మోడీ గారి 'మేకిన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్'లకు అర్ధం ఏమిటి? రూ. 40 వేల కోట్ల కాంట్రాక్ట్ అమెరికా కంపెనీ జనరల్ మోటార్స్‌కి మోడీ డీజిల్ ఇంజిన్ల తయారీ ఆర్డర్‌కి ఒప్పందం చేసుకున్నారు. కానీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోని డీజిల్ లోకోమోటివ్ వర్క్‌షాపు రూ. 20 వేల కోట్లకే తయారు చేయగలదని రైల్వే బోర్డు సభ్యుడు ఆచార్య చెప్పారంటే...మోడీ గారికున్న 56 అంగుళాల ఛాతీ భారత ప్రజల ప్రయోజనాల కోసమా? విదేశీ కంపెనీలకు భారత ప్రజల సంపదని ధారాదత్తం చేయడానికా?
అందుకే రైల్వేల ప్రైవేటీకరణ, మోనిటైజేషన్ దేశ ప్రయోజనాల కోసం కాదు. దేశ ప్రజల సంపదని కార్పొరేట్లకు దోచిపెట్టడానికే! ఇది ఒక్క రైల్వేలోనే కాదు. మన రాష్ట్రంలోని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీగానీ, పబ్లిక్ సెక్టార్లుగానీ భూగర్భ ఖనిజ సంపద నుండి అంతరిక్ష స్పెక్ట్రం వరకూ కార్పొరేట్లకు కట్టబెట్టడమే మోడీ ప్రభుత్వ లక్ష్యం. దీనిని అడ్డుకోవాలంటే....కార్పొరేట్ల కొమ్ము కాస్తున్న ఈ ప్రభుత్వాన్ని వెనువెంటనే సాగనంపడమే భారత ప్రజల ముందున్న తక్షణ మార్గం. లేకుంటే దేశ ప్రజల బతుకులు బుగ్గిపాలవ్వడం ఖాయం. తస్మాత్ జాగ్రత్త.
వ్యాసకర్త : వి.ఉమామహేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు