Nov 08,2023 09:49
  • విశాఖ ఉక్కు పోరాటానికి వెయ్యి రోజులు

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' ... ఇది కేవలం నినాదం కాదు. ఆంధ్రుల ఆత్మగౌరవ చిహ్నం! ఆనాడైనా ...ఈనాడైనా ఆంధ్రావనిని ఏకతాటిపై నిలిపి పోరాటానికి పదును పెట్టిన చైతన్యం!! వెయ్యిరోజులుగా విరామమెరుగక ఎగురుతున్న ప్రైవేటీకరణ వ్యతిరేక, ప్రభుత్వ రంగ పరిరక్షణ పతాకం! అవును ! ప్రజా పోరాటాల చరిత్రలోనే ఇదొక అద్భుత ఘట్టం! నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై ఐక్య కార్మిక వర్గం విశాల ప్రజానీకపు మద్దతుతో చేస్తున్న పోరాటం మంగళవారానికి వెయ్యి రోజులకు చేరుతోంది. 'ఎవడురా అమ్మేది?..ఎవడురా కొనేది' అని నినదిస్తూ 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పాటైన విశాఖ ఉక్కును విశాఖ ఉక్కును తెగనమ్మాలన్న మోడీ సర్కారు కుట్రలను తిప్పికొట్టడానికి మరింత సమరశీల పోరాటానికి కార్మికులు సిద్ధమౌతున్నారు. 2021 జనవరి 27న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వంద శాతం వాటాల ఉపసంహరణతో స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తామంటూ చేసిన ప్రకటనపై భగ్గుమన్న స్టీల్‌ప్లాంట్‌లోని కార్మిక సంఘాలన్నీ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా ఏర్పడ్డాయి. ఐక్యంగా పోరాటాలు నిర్వహిస్తున్నాయి, వీటికి కూర్మన్నపాలెం కూడలిలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన శిబిరం పోరాట కేంద్రంగా నిలుస్తోంది. ఓ వైపు కార్మికుల పోరాటం సాగుతుండగా, మరోవైపు కేంద్రంలోని మోడీ సర్కారు స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తిని దెబ్బతీసేలా ఐరన్‌ ఓర్‌, గనులు ఇవ్వకుండా, ప్లాంట్‌లోని మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను రెండేళ్లుగా మూసేసి కుట్రలు సాగిస్తోంది.
 

                                                         అమ్మకం కమిటీలను తిప్పికొట్టిన కార్మికులు

అమ్మకం నిర్ణయం చేసిన తర్వాత మోడీ సర్కారు ప్లాంట్‌ అంచనా కోసం వేల్యుయేషన్‌ కమిటీని వేసి ప్లాంట్‌కు పంపగా కార్మికులు అడుగుపెట్టనివ్వకుండా తరిమికొట్టారు. 2021 నవంబర్‌ 10న కేంద్రం రెండు కమిటీలను వేసింది. హెలికాప్టర్‌లో ఈ కమిటీ సభ్యులు వచ్చి ప్లాంట్‌ను పరిశీలించాలని భావించారు. ఈ సందర్భంగా వందల మిగతా 2లో సంఖ్యలో కార్మికులు తరలివచ్చి వారిని అడ్డుకున్నారు.
 

                                                                   గోడమీద పిల్లిలా ఆ మూడు పార్టీలు

అధికార వైసిపి అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుంది. ప్లాంట్‌ పరిరక్షణపై చొరవ ప్రదర్శించడం లేదు. టిడిపి, జనసేన పార్టీలకు బిజెపితో పొత్తులపై ఉన్న యావ విశాఖ ఉక్కు పరిరక్షణపై లేదు. దీంతో కార్మికులే పోరాటాన్ని ముందుకు నడుపుతున్నారు. వీరికి రైతాంగం మద్దతు తెలిపింది. సాధారణ ప్రజానీకం మద్దతుగా ఉంది. వామపక్ష శక్తులు అండగా నిలిచాయి.
 

                                                                    కార్పొరేట్‌ మిత్రుల కోసమే..!

ఛత్తీస్‌గఢ్‌లోని నాగర్‌నార్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించడం లేదని అమిత్‌ షా ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో విశాఖ ఉక్కు విషయంలో తన కార్పొరేట్‌ మిత్రుల ప్రయోజనాలే ముఖ్యంగా మోడీ సర్కారు వ్యవహరిస్తోంది. నాగర్‌నార్‌ స్టీల్‌ ఏటా కేవలం మూడు మిలియన్‌ టన్నుల ఉత్పత్తే చేస్తోంది. ఎన్‌ఎండిసి తన అవసరాల కోసం దీన్ని ఏర్పాటు చేసుకుంది. రూ.లక్షల కోట్లు విలువ చేసే భూములేవీ అక్కడ లేదు. కానీ, వైజ ాగ్‌ స్టీల్‌ ప్లాంటు దీనికి భిన్నం! 1960వ దశకంలో 32 మంది ప్రాణత్యాగంతో విశాఖ ఉక్కు ఏర్పాటైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్లాంటుకు సొంత గనులను కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు. అయినా, 2002 నుంచి 2008 వరకూ లాభాల్లోనే ఉంది. 2004 ఒక్క సంవత్సరంలోనే రూ.2800 కోట్లు రికార్డు స్థాయి లాభాలొచ్చాయి. 22 వేల ఎకరాలను కలిగిన స్టీల్‌ప్లాంట్‌ ఆస్తుల విలువ రూ.3.20 లక్షల కోట్లు పైమాటే. అందుకే తన కార్పొరేట్‌ మిత్రులకు దీనిని కట్టబెట్టాలని, తద్వారా అధికారంలో కొనసాగాలన్నది బిజెపి వ్యూహం! దానిని తిప్పికొట్టి, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడటమే కార్మిక పోరాట లక్ష్యం!