ప్రజల భవిష్యత్తు కోసమే.. బిజెపి కుట్రలను తిప్పికొడతాం : 'ప్రజాశక్తి' ఇంటర్వ్యూలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు ఉద్ఘాటన

ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : ప్రజల భవిష్యత్తు కోసమే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలని పోరాడుతున్నామని ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలు చెప్పారు. విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన నేపథ్యంలో పోరాట కమిటీ నేతలు జె.అయోధ్యరాం (సిఐటియు), డి.ఆదినారాయణ (ఎఐటియుసి), మంత్రి రాజశేఖర్ (ఐఎన్‌టియుసి) ప్రజాశక్తితో మాట్లాడారు. విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించే విశాఖ స్టీల్ ప్లాంటును ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని వారు తెలిపారు. ప్లాంటును ప్రైవేటుకు తెగనమ్మాలనే కేంద్ర ప్రభుత్వ, బిజెపి కుట్రలను ప్రజల సహకారంతో తిప్పికొడతామని చెప్పారు. 635 రోజులుగా సాగుతున్న విశాఖ ఉక్కు ఉద్యమానికి రాష్ట్రంలోని ప్రజలందరి మద్దతు లభిస్తోందని అన్నారు.
ప్రధాని ప్రకటన చేయాలి
ఆంధ్రా యూనివర్శిటీలో జరిగే బహిరంగసభలో విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటన చేయాలని స్టీల్ ప్లాంట్ గుర్తింపు సంఘం గౌరవాధ్యక్షులు ఆదినారాయణ డిమాండ్ చేశారు. ఆ ప్రకటన చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేసి, రాష్ట్రాన్ని అట్టుడికిస్తామని ఆయన చెప్పా రు. రెండేళ్ల క్రితమే ప్రధాన మంత్రి మోడీ స్టీల్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేస్తామని రోడ్లు వేసి, ఇతర మౌలిక వసతుల కోసం రూ.100 కోట్లు ఖర్చుపెట్టారని, ఇప్పుడు ప్లాంటును అమ్మకానికి పెట్టడం దుర్మారపు చర్యని అన్నారు
'అదానీకి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను కట్టబెట్టే చర్యల్లో భాగంగానే రాయపూర్ నుంచి విశాఖపట్నంకు 6 లేన్ల రోడ్డును మోడీ వేయిస్తున్నారు. దీనివల్ల ఉపాధి ఎవరికైనా లభిస్తుందా ? తిండి దొరుకుతుందా ? విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి 8 మిలియన్ టన్నులున్నదాన్ని 20 మిలియన్ టన్నులు చేస్తే కోటి మందికి ఉపాధి లభిస్తుంది. ఇదెంతో ఈ ప్రాంతానికి మేలు కలిగిస్తుంది.' అని ఆయన చెప్పారు.
పోరాటాల ద్వారానే నిలబెట్టుకుంటాం
'వైజాగ్ స్టీల్‌ప్లాంట్ దేశానికే గర్వకారణమైన కర్మాగారం. అనేక పోరాటాలు చేస్తే దీన్ని సాధించుకోవడం జరిగింది. పోరాటాలతోనే నిలబెట్టుకుంటాం' అని ఐఎన్‌టియుసి స్టీల్‌ప్లాంట్ గౌరవాధ్యక్షులు మంత్రి రాజశేఖర్ అన్నారు. 'గతంలో యుపిఎ హయాంలోనూ స్టీల్‌ప్లాంట్‌కు ప్రమాదం వచ్చినప్పుడు పోరాడి నిలుపుకున్నాం. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నుంచీ స్టీల్‌ప్లాంట్‌పై కుట్రలు సాగించడం పెరిగింది. బరితెగించేలా వ్యవహరిస్తోంది.' అని చెప్పారు. 'స్టీల్‌ప్లాంట్ భూములు, మౌలిక వసతులను కార్పొరేట్లకు దోచిపెట్టే విధానం కేంద్రం తీసుకుంది. ప్రభుత్వ రంగం పునాదులకే బిజెపి ప్రమాదం తెచ్చిపెడుతోంది. ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేయడం అంటే భారత రాజ్యాంగంపైనా దాడులు చేయడమే అవుతుంది. అన్ని తరగతులూ ఏకమై దీనిని ఎదిరించాలి.' అని అన్నారు. స్టీల్‌ప్లాంట్ అమ్మకాన్ని ఆపుతున్నట్లు ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలి లేకపోతే జరిగే పరిణామాలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు.
రూ.3 లక్షల కోట్ల ప్లాంటును 30 వేల కోట్లకా ?
రూ 3 లక్షల కోట్ల ఆస్తులున్న స్టీలు ప్లాంటును 30 వేల కోట్ల రూపాయలకు అదానీకో, అంబానీకో తెగనమ్మడానికి కేంద్రం కుట్ర చేస్తోందని విశాఖ ఉక్కు పోరాట కమిటీ కన్వీనర్ జె. అయోధ్య రామ్ అన్నారు. ఇది సమర్ధనీయమా అని ఆయన ప్రశ్నించారు. 'ప్లాంట్ సాధన కోసం 32 మంది ప్రాణ త్యాగం చేశారు. 16వేల మంది భూములు కోల్పోయారు. దీనిని ప్రైవేటు కిస్తే వారి త్యాగం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కార్మికులు సంపదను సృష్టించారు. వీటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్లాంటు అమ్మకాన్ని ఆపుతున్నట్లు ప్రధాని ప్రకటించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం.' అని ఆయన అన్నారు. 'విశాఖకు రైల్వే జోన్ వస్తుందో రాదో బిజెపి నేతలు వెల్లడించడం లేదు. ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్‌ను ఎత్తేశారు? స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టారు. ఇప్పుడేమో రాయపూర్ నుంచి విశాఖపట్నానికి ఆరు లేన్ల రోడ్డు వేస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖలో అభివృద్ధి చేయాలనుకుంటే డివిజన్‌ను ఎత్తేయడం సమంజసమా? ఎవరి కోసం రాయపూర్ లైన్ రోడ్లు వేస్తున్నారు? రోడ్లు వేస్తే ఉన్న ప్రభుత్వ సంస్థలను, ఆస్థులను ఆమ్మేస్తారా? రాయపూర్ నుంచి విశాఖకు రోడ్డు వేసి స్టీల్‌ప్లాంట్‌ను కార్పొరేట్లకు అమ్మేసేలా 'మార్గం సుగమం' చేస్తారా?' అని ప్రశ్నించారు. తక్షణం ఈ విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 'ఈ నెల 12న దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏయూ గ్రౌండ్స్ నుంచి ప్రసంగిస్తున్నారు. ప్రధానిచేత ముఖ్యమంత్రి స్టీల్ ప్లాంటు అమ్మకాన్ని ఆపేలా ప్రకటన చేయించాలి' అని అన్నారు.