
- భారీ ర్యాలీలు..హోరెత్తిన నినాదాలు
- అడుగడుగునా అడ్డుకును పోలీసులు
- పలువురికి గాయాలు
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో, అమరావతి బ్యూరో : ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పర్యటన నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం ఒక్కసారిగా ఉధృతమైంది. విశాఖ నగరమంతా బుధవారం విశాఖ ఉక్కు .. ఆంధ్రుల హక్కు అను నినాదాలు మారుమ్రోగాయి. విశాఖ పర్యటనలోనే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రధాని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో రోడెక్కారు. ఒకవైపు ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు, మరోవైపు వివిధ ప్రజాసంఘాలు, కార్మికసంఘాలు చేపట్టిన ర్యాలీలతో విశాఖ నగరం మారుమ్రోగింది. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, అఖిలపక్ష కార్మిక సంఘాల జెఎసి పిలుపు మేరకు స్టీల్‌ప్లాంట్ గేటు నుంచి విశాఖ నగరంలోని జివిఎంసికి బైక్ ర్యాలీని కార్మికులు చేపట్టిన బైక్‌ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఉదయం ఆరు గంటల నుంచే కార్మికులను ముందుకు సాగనీయకుండా బారికేడ్లు అడ్డంగా పెట్టారు.దీంతో ఉదయం 9.30 గంటల సమయంలో కార్మికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. శాంతియుతంగా తాము బైక్ ర్యాలీ చేపడుతున్నామని, అడ్డుకోవద్దని కార్మికులు కోరారు. సెక్షన్ 30 అమల్లో ఉనుందున ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు తెగేసి చెప్పారు. దీంతో, బైక్‌లను వదిలేసి కార్మికులు పాదయాత్రగా బయలుదేరారు. మొదటి పోలీసుల వలయాన్ని ఛేదించి ముందుకెళ్లారు. కొద్దిదూరం వెళ్లేసరికి వడ్లపూడి పెట్రోల్ వద్ద పోలీసులు మరలా వలయాన్ని ఏర్పాటు చేసి అడ్డుకోగా కార్మికులంతా అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడి నుండి కూడా ముందుకు సాగి శ్రీనగర్ డి-మార్టు వద్ద పోలీసుల రోప్‌ను ఛేదించుకొని దూసుకెళ్లారు. గాజువాక పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్దకుర్యాలీ వచ్చే సరికే వందల సంఖ్యలో పోలీసులు బలమైన రోప్‌ల (తాళ్ల)తో ర్యాలీని అడ్డుకున్నారు. ర్యాలీ ముందు వరసలోనివిశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, జెఎసి నాయకుల కాళ్లపైనా, మెడపైనా రోప్‌లతో గట్టిగా నొక్కిఉంచారు. దీంతో స్టీల్‌ప్లాంట్ రిటైర్డ్ కార్మికుడు రామారావు రెండు కాళ్లకూ తీవ్ర గాయాలయ్యాయి. ఇక్కడ జరిగిన పెనుగులాటలో 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు మెడపై రోప్‌తో పోలీసులు నొక్కేయడం, వెనక్కి నెట్టేయడంతో ఆయన తీవ్ర అవస్థకు గురవ్వడం కనిపించింది. 200 మందిని పోలీసులు అరెస్టు చేసి గాజువాక స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరాం, ఆదినారాయణ, వైటి.దాస్, కెఎస్‌ఎన్, వరసాల శ్రీనివాసరావు, నీరుకొండ రామచంద్రరావు తదితరులు ఉన్నారు. స్టీల్‌ప్లాంట్ రక్షణ ఉద్యమంపై ప్రభుత్వం, పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తుండడం తగదని కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
- అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యాన విశాఖ నగరంలో భారీ ర్యాలీ
'విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి' అంటూ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకుడిఆర్‌ఎం కార్యాలయం నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ జరిగిన సభలో అఖిలపక్ష కార్మిక సంఘాల జెఎసి చైర్మన్ ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయరాదనేది తెలుగు ప్రజల ఆకాంక్షని తెలిపారు. దీనికి విలువనిచ్చి ప్రైవేటీకరణ చేయడం లేదనిఈ నెల 12న విశాఖలో జరిగే కార్యక్రమాల్లో ప్రధానినరేంద్ర మోడీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రభుత్వరంగ సంస్థలను కూడా ప్రైవేటీకరించబోమని ప్రకటించాలని కోరారు.
- అరెస్టులు అక్రమం : సిపిఎం
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన బైక్ ర్యాలీని అడ్డుకొని అరెస్టులకు పాల్పడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి నిర్బంధానికి పూనుకోవడం సరైంది కాదని ప్రభుత్వ వైఖరినితప్పు పట్టింది. ఈ మేరకుసిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను బిజెపి మినహా మిగతా అన్ని పార్టీలూ వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ప్రైవేటీకరణ వద్దనిరాష్ట్ర అసెంబ్లీ తీర్మాణం చేసిన తరువాత ఇప్పుడు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులపై నిర్బంధం ప్రయోగించడం వైసిపి రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రానికి తలమానికమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకూడదని 636 రోజులుగా కార్మికులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా విశాఖలోని కూర్మనుపాలెం నుండి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు ప్రశాంతంగా బైక్ ర్యాలీ చేపట్టారని, దీనిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ర్యాలీకి అనుమతినిచ్చి ఇప్పుడు రద్దు చేయడం అప్రజాస్వామికమని తెలిపారు. ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా కార్మికుల పక్షాన విశాఖ ఉక్కుపై ప్రకటన చేసేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావల్సిందిపోయి, కేంద్రానికి వత్తాసు పలకడం గర్హనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన బాధ్యత గుర్తెరిగి విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులకు అండగా నిలవాలని, ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కు తీసుకునేలా ఈ పర్యటన సందర్భంగా ప్రధానిపై ఒత్తిడి తేవాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.