
వ్యవసాయ సహకార ఉద్యోగ సంఘాల యూనియన్ రిలే దీక్షల్లో ఎమ్మెల్సీ లక్ష్మణరావు
ప్రజాశక్తి-గుంటూరు :సహకార రంగంలో ప్రయివేటీకరణ విధానాలను విడనాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. పిఎసిఎస్‌ల ప్రయివేటీకరణ విధానాలు విడనాడాలని, ఉద్యోగులకు వేతన సవరణ చేయాలనే తదితర డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార ఉద్యోగ సంఘాల యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గుంటూరులోని సహకార శాఖ కమిషనరేట్ వద్ద మూడ్రోజులపాటు నిర్వహించే రిలే దీక్షలను ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 ఏళ్లకుపైగా రైతులకు రుణసదుపాయం కల్పిస్తున్న పిఎసిఎస్‌లలో ప్రయివేటు వ్యక్తులకు 50 శాతం వాటాను అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. ఈ నిర్ణయంతో పిఎసిఎస్‌లు నిర్వీర్యం అవుతాయని, కేంద్రం చేసిన చట్టమే దీనికి కారణమని విమర్శించారు. 2019 నుంచి ఉద్యోగులకు వేతన సవరణ పెండింగ్‌లో ఉందని, తక్షణమే వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ చేసిన నిర్ణయాన్ని పిఎసిఎస్ ఉద్యోగులకూ వర్తింపజేయాలని కోరారు. యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి.అజరుకుమార్ మాట్లాడుతూ..ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసి, ఎన్నికల్లో గెలిచాక తీవ్ర నిర్బంధానికి గురి చేస్తోందన్నారు. వేతన సవరణ చేయకపోవడం వల్ల పెరిగిన ధరలతో ఉద్యోగుల జీవనం దుర్భరంగా మారిందని తెలిపారు. సమస్యలను తక్షణమే పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి, కార్యదర్శి బి.లక్ష్మణరావు, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ, వివిధ జిల్లాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.