సిడబ్ల్యుసితో నైట్ ఫ్రాంక్ ఒప్పందం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్య (పిపిపి) విధానంలో గోదాముల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (సిడబ్ల్యుసి)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. ఈ భాగస్వామ్యంలో తెలంగాణలోని 2 ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 4 ప్రాంతాలు సహా దేశంలోని మొత్తం 54 ప్రదేశాల్లో వేర్ హౌసింగ్‌లను అభివృద్థి చేయనున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా గోదాము సదుపాయాల విస్తరణ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఎపిలోని పెదకాకాని, రాయనపాడు, అనకాపల్లి, నెల్లూరుల్లో గోదాములను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన స్థలాలను సిడబ్ల్యుసి ఎంపిక చేసిందని వెల్లడించింది. ఈ గోదాముల ప్రాజెక్టు వ్యయం రూ.181.33 కోట్లుగా అంచనా వేసింది. తెలంగాణలో వరంగల్, నాంపల్లిలో కొత్త గోదాములు ఏర్పాటు చేయనుంది. వీటి నిర్మాణానికి రూ.71.16 కోట్లుగా అంచనా వేసింది. గోదాముల నిర్మాణాలు, నిర్వహించాలని భావించే రియల్ ఎస్టేట్ వర్గాలకు మంచి అవకాశమని నైట్ ఫ్రాంక్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులామ్ జియా తెలిపారు. నేషనల్ మానిటైజేషన్ ప్లాన్ కింద, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఈ గోదాములను 45 ఏళ్ల పాటు పిపిపి పద్దతిలో ప్రయివేటు పెట్టుబడిదారులకు అప్పగించనుంది.