Sep 23,2023 14:49

వారణాసి : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, టీమిండియా దిగ్గజాలు కపిల్‌ దేవ్‌, సునిల్‌ గావస్కర్‌, సచిన్‌ టెండుల్కర్‌ బిసిసిఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జై షా తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో సచిన్‌ టెండూల్కర్‌ ప్రధాని నరేంద్ర మోడీకి టీమిండియా జెర్సీ బహూకరించారు. 'నమో' అని రాసి ఉన్న ఆ ప్రత్యేకమైన జెర్సీని సచిన్‌ చేతుల మీదుగా అందుకున్న మోడీ హర్షం వ్యక్తం చేశారు.

స్టేడియం విశేషాలు

varanasi

ఈ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా డిజైన్‌ చేశారు. త్రిశూలాన్ని పోలిన ప్లడ్‌లైట్లు, శివుడి చేతిలో ఉండే ఢమరుకం రూపంలో పెవిలియన్‌ స్టాండ్‌ నిర్మించనున్నారు. గంగా ఘాట్‌ మెట్ల మాదిరిగా ప్రేక్షకుల గ్యాలరీ ఉండనుంది. స్టేడియం ప్రవేశ ద్వారంలో బిల్వ పత్రం ఆకును పోలిన మెటాలిక్‌ షీట్‌లను ఏర్పాటు చేయనున్నారు. పైకప్పు అర్ధ చంద్రాకారాన్ని ప్రతిబింబించనుంది. సూమారు 30,000 సీటింగ్‌ సామర్థ్యంతో స్టేడియాన్ని నిర్మించనున్నారు. ఈ స్టేడియం నిర్మాణానికి అవసరమైన 121 ఎకరాల భూసేకరణ కోసం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రూ.121 కోట్లు వెచ్చించింది. స్టేడియం నిర్మాణానికి రూ.330 కోట్లు ఖర్చుకానుంది.