వర్షాకాలంలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఒకసారి వచ్చాయంటే ఓ పట్టాన వదిలిపోవు. చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. వచ్చాక జాగ్రత్తలు తీసుకోవడం కంటే రాకుండా జాగ్రత్త పడటం ముఖ్యం. ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా సౌకర్యవంతంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించాలి.
వ్యక్తిగత పరిశుభ్రత
క్రమం తప్పకుండా స్నానం చేయాలి. తరచుగా చేతులు కడుక్కోవాలి. ప్రతిరోజూ ఉతికిన బట్టలే వేసుకోవాలి. పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచడం చాలా ముఖ్యం. పాదాలు సౌకర్యవంతంగా ఉండేలా బూట్లకు బదులుగా చెప్పులు లేదా ఓపెన్-టోడ్ బూట్లు ధరించడం మేలు. అలాగే గోళ్లను చిన్నగా శుభ్రంగా కత్తిరించుకోవాలి.
వస్త్రధారణ ఇలా ...
వదులుగా ఉండే దుస్తులను ధరించాలి. స్పాండెక్స్ లేదా నైలాన్ వంటి సింథటిక్ ఫ్యాబ్రిక్‌లను ధరించకూడదు. ఈ బట్టలు శరీరానికి గాలిని తగలనివ్వవు. శరీరంపై వేడి, తేమను పట్టిఉంచుతాయి. కాబట్టి వదులైన దుస్తులే వేసుకోవాలి.
చర్మాన్ని పొడిగా ఉంచండి..
ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే చుట్టూ ఉన్న వాతావరణాన్ని పొడిగా ఉంచాలి. నివాస స్థలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే గాలిలో తేమను తగ్గించడానికి, శిలీంధ్రాల పెరుగుదలను అరికట్టడానికి ఇంటిలోని అన్ని ప్రాంతాలకు ధారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోండి.
ప్రత్యేక టవల్ ఉపయోగించండి..
తువ్వాలు లేదా దుస్తులు వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దు. ఇప్పటికే ఫంగల్ ఇన్ఫెక్షన్ సంకేతాలను చూపుతున్నట్లయితే ఇంకా జాగ్రత్త పడాలి. అలాగే లాకర్ రూమ్‌లు లేదా పబ్లిక్ పూల్స్ వంటి బహిరంగ ప్రదేశాల్లో చెప్పులు లేకుండా నడవకూడదు. ఎందుకంటే ఈ ప్రదేశాల్లో తరచుగా తేమ ఎక్కువగా ఉంటుంది, ఇది శిలీంధ్రాల సంతానోత్పత్తికి కారణమవుతుంది.
తగిన చికిత్స తీసుకోవాలి
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు గురైతే.. తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యం. తేలికపాటి ఫంగల్ ఇన్ఫెక్షన్‌లకు చికిత్స చేయడానికి ఓవర్-ది-కౌంటర్ యాంటీ ఫంగల్ క్రీమ్‌లు లేదా స్ప్రేలను ఉపయోగించవచ్చు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారిన పడితే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి.










