క్విటో : ఈక్వెడార్ అధ్యక్ష అభ్యర్థి, పాత్రికేయుడు ఫెర్నాండో విల్లావిసెన్సియో వాలెన్సియో బుధవారం హత్యకు గురయ్యారు. ఉత్తర క్విటోలో కిరాయి హంతకులు హత్య చేసినట్లు అధికారులు తెలిపారు. కాన్‌స్ట్రుయే లిస్టా 25 మూవ్‌మెంట్ తరపున వాలెన్సియా ర్యాలీ నిర్వహిస్తుండగా ఈక్వెడార్ రాజధాని క్విటోకు ఉత్తరాన ఉన్న అండర్సన్ పాఠశాల కొలిజియంలో ఈ దాడి జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం.. 6.00 గంటలకు కాల్పులు జరిగాయి. వాల్సెనియా తలపై మూడు రౌండ్ల కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై జాతీయ పోలీసులు విచారణ చేపట్టారు.
తీవ్ర గాయాలైన వాల్సెనియాను ఆస్పత్రికి తరలించామని, అయితే అప్పటికే మరణించాడని వైద్య బృందం నిర్థారించిందని వాల్సెనియా మామ గాలో వాల్సెనియా వెల్లడించారు. ర్యాలీ జరుగుతున్న పాఠశాలపై సాయుధ దుండగులు విరుచుకుపడ్డారని, 40 సార్లు కాల్పులు జరిపారని అన్నారు. వాల్సెనియా తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయని చెప్పారు. ఈ ఘటన నుండి తాను ప్రాణాలతో బయటపడ్డానని అన్నారు. లాస్ చోన్‌రోస్ అనే ముఠా నుండి వాల్సెనియాకు గతవారం బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. వాల్సెనియా మృతికి ఈక్వెడార్ అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో సంతాపం ప్రకటించారు. అతని కుటుంబానికి సానుభూతి తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.