వాషింగ్టన్ : ఆర్థిక మాంద్యం, డాలర్ ఆధిపత్యం బలహీనపడుతుండడంతో అంతర్జాతీయంగా అమెరికా పలుకుబడి సన్నగిల్లుతున్న నేపథ్యంలో ఆ దేశానికి రెండవ సారి సారథ్యం వహించాలని ఎనబై ఒక్క ఏళ్ల జో బైడెన్ తహతహలాడుతున్నారు. వచ్చే ఏడాది నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున తాను తిరిగి పోటీ చేస్తున్నట్లు ఆయన మంగళవారం లాంఛనంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో బైడెన్ పోస్టు చేశారు. పనిలోపనిగా ఎన్నికల ప్రచారాన్ని కూడా ఈ వీడియోతోనే ఆయన ప్రారంభించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తనను మరోసారి ఎన్నుకోవాలని, దేశానికి సేవ చేసేందుకు మరింత గడువు ఇవ్వాలని అమెరికన్లను ఆయన కోరారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యక్షపదవికి తిరిగి పోటీచేయనున్నారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థులను ప్రధానమైన రెండు పార్టీలు ప్రైమరీస్ ఎన్నికల ద్వారా ఖరారు చేస్తాయి. అయితే, అధ్యక్షుడే రెండవ పర్యాయం పోటీకి దిగుతున్నానని ప్రకటించడంతో డెమొక్రాటిక్ పార్టీలో ప్రైమరీస్ ఎన్నిక ఇక లేనట్టే. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఫ్లోరిడా రాష్ట్ర గవర్నరు రాన్ డిశాంటిస్ కూడా బరిలోకి దిగే అవకాశమున్నందున అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ తరపున తుది అభ్యర్థిని ఖరారు చేసేందుకు ప్రైమరీస్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.