Aug 21,2023 14:53

క్విటో :   ఈక్వెడార్‌లో సిటిజన్‌ రివల్యూషన్‌ మూమెంట్‌ (లెఫ్ట్‌)కి చెందిన లూయిసా గొంజాలెజ్‌ అత్యధిక ఓట్లు సాధించిన అధ్యక్ష అభ్యర్థిగా నిలిచారు. 43.92 శాతం చెల్లుబాటు ఓట్లలో లూయిసా గొంజాలెజ్‌ 33.44 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నట్లు నేషనల్‌ ఎలక్టోరల్‌ కౌన్సిల్‌ (సిఎన్‌ఇ) తెలిపింది. ఆగస్టు 20 ఆదివారం నిర్వహించిన ముందస్తు ఎన్నికల వివరాలను సిఎన్‌ఇ వెల్లడించింది. యాక్షన్‌ డెమోక్రటిక్‌ నేషనల్‌ (ఎడిఎన్‌) రాజకీయ ఉద్యమానికి పిలుపునిచ్చిన యునైటెడ్‌ ఈక్వెడారియన్‌ పార్టీకి చెందిన మరో అభ్యర్థి డేనియల్‌ నొబోవా 24.31 శాతం ఓట్లను సాధించారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఈక్వెడార్‌ మాజీ అధ్యక్షుడు రాఫెల్‌ కొరియా మద్దతుదారుడైన లూయిసా గొంజాలేజ్‌ మాట్లాడారు. ''మొదటిగా, మార్పు కోసం ఉద్యమించిన అన్ని పౌర సంఘాలకు, రెండు.. అసెంబ్లీ అభ్యర్థులందరికీ, మూడు.. ఈ దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. మా ఆకాంక్ష, ప్రశంసలు ఎప్పుడూ ఈక్వెడారియన్‌ ప్రజలతోనే ఉంటాయి'' అని అన్నారు.

ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమాన నిష్పత్తిలో ఓట్లు వచ్చి వుంటే.. ఎంతో ఇష్టమైన ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు రెండో రౌండ్‌ ఓటింగ్‌కు వెళ్లాల్సి వచ్చేది.

సాంప్రదాయవాది అయిన ప్రస్తుత అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో ప్రజా వ్యతిరేక  విధానాలను నిరసిస్తూ  దేశవ్యాప్తంగా ఆందోళనలు  వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  దీంతో లాస్సో అభిశంసన ప్రక్రియను తిప్పికొట్టేందుకు... మే 17న ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చిచ్చారు.  2008  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 130, 148 ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు.