Oct 18,2023 07:42
  • అట్టహాసంగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

న్యూఢిల్లీ : 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. 2021 ఏడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్‌ 'పుష్ప' సినిమాకు అందుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన 'ఉప్పెన' చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాతలు నవీన యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులమీదుగా జాతీయ పురస్కారాల్ని అందుకున్నారు.

11

దాదాసాహెబ్‌ పాల్కే జీవితకాల సాఫల్య పురస్కారానికి వహిదా రెహమాన్‌ రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డు అందుకున్న తర్వాత అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. తొలిసారి జాతీయ అవార్డ్‌ అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కమర్షియల్‌ చిత్రానికి (పుష్ప) జాతీయ అవార్డు రావడమనేది డబుల్‌ అఛీవ్‌మెంట్‌ అని పేర్కొన్నారు. ఆగస్ట్‌లో జాతీయ పురస్కారాల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, కేంద్ర సమాచార, ప్రసార సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ పాల్గొన్నారు.