Jun 20,2023 21:40

- కనీసం డిగ్రీతో బయటకు రావాలి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రతి ఒక్కరూ బడిబాట పట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. చదువు కోసం పేదలు అప్పులపాలు కాకూడదని, చదువులకు దూరం కాకూడదని ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. విదేశాల్లో సీటు తెచ్చుకుంటే ఫీజుల కోసం భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తోడుగా ఉంటుందని అన్నారు. 'జగనన్న ఆణిముత్యాలు' కార్యక్రమం విజయవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం జరిగింది. పిల్లలందరూ ప్రతి రంగంలోనూ ఎదిగి ఎగరాలని, ప్రపంచానికి లీడర్లుగా ఉండాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నామని సిఎం చెప్పారు. అందుకనే నాలుగేళ్లలో నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వం శ్రద్ధ పెట్టిందన్నారు. ప్రభుత్వ బడులు, పాఠశాలలను మరింత గొప్పగా మార్చాలన్న కోరిక మరింతగా పెరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీతో బయటకు రావాలన్నారు. ప్రైవేటు బడులు.. గవర్నమెంటు బడులతో పోటీ పడక తప్పదనే పరిస్థితి తీసుకొచ్చామన్నారు. పిల్లలందరికీ మంచి చదువులు ఉండాలని మేనమామగా కోరుకుంటున్నాని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ సిలబస్‌ కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుందని, పరీక్షలు కూడా అలానే ఉంటాయని చెప్పారు. మెదడులోకి డ్రిల్‌ చేసి రాయడం కాకుండా పరీక్షలకు టెక్ట్స్‌బుక్స్‌ తీసుకునిపోయినా ఫర్వాలేదనే విధానంలోకి మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చదువులు వేగంగా మారుతున్నాయని తెలిపారు. మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, చాట్‌ జిపిటి యుగంలో విద్యారంగం పూర్తిగా మారబోతోందన్నారు. ఈ మార్పును ప్రతి పేదవాడికీ తీసుకురావాలని, అప్పుడే ప్రపంచాన్ని ఏలగలుగుతామని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలు ప్రపంచాన్ని ఏలే పరిస్థితి త్వరలోనే వస్తుందని, ఆ స్థాయిలో మార్పులు జరుగుతాయని చెప్పారు. లీడర్‌ షిప్‌ క్వాలిటీస్‌ పెంచేలా చదువులు ఉండాలని అన్నారు. రానున్న ఏడాదిలో మరింత మంచి ఫలితాలు రావాలని ఆణిముత్యాలు కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పారు.
విద్యాశాఖ మంత్రి బత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులు, అధ్యాపకుల్లో స్ఫూర్తినిచ్చేందుకు కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. విద్యార్థి ఎక్కడికి వెళ్లినా పోటీతత్వంలో నిలబడాలంటే మంచి బోధన అందించాలని తెలిపారు. పదోతరగతి, ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను, ఉన్నత విద్యలో బ్రిలియన్స్‌ అవార్డులు సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను సిఎం జగన్‌ మెడల్‌తో సత్కరించి నగదు అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, ఉష శ్రీచరణ్‌, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపి వల్లభనేని బాలశౌరి, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌, కమిషనరు ఎస్‌ సురేష్‌కుమార్‌, ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరిబాబు, సమగ్రశిక్ష ఎస్‌పిడి శ్రీనివాస్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, విద్యాశాఖ సలహాదారు సాంబశివారెడ్డి తదితరులు పాల్గన్నారు.