Aug 06,2023 13:16

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా (గుంటూరు) : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు చాలా కీలకమని పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి అన్నారు. ఓటర్ల జాబితాను సన్నద్ధం చేయడంలో ఎక్కడా ఆరోపణలు, అవకతవకలకు తావులేకుండా అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి ఆదేశించారు. అన్ని రాజకీయ పార్టీల వినతులను పరిగణలోకి తీసుకొని ఓటర్ల జాబితాను సన్నద్ధం చేయాలని జిల్లా అధికారులను సూచించారు.

పల్నాడు జిల్లాలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ -2024 సంక్షిప్త ఓటర్ల జాబితా సర్వే ప్రక్రియకు సంబంధించి జిల్లా కలెక్టరేట్‌ లోని ఎస్‌ ఆర్‌ శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఆదివారం ఈఆర్‌ ఓ లు, ఏఈఆర్‌ఓ లతో సమీక్షా సమావేశం జరిగింది. సంక్షిప్త ఓటర్ల జాబితా సర్వే జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను జిల్లా అధికారులను అడిగి తెలుసుకొని, అందుకు తగిన విధంగా తీసుకోవల్సిన చర్యలపై దిశా, నిర్దేశనం చేశారు. 28 మండలాలు, 7 నియోజక వర్గాలలలో ఎన్నికల నిర్వహణ అధికారులు గా కొనసాగుతున్నవారు నిస్పక్షపాతంగా సర్వే ప్రక్రియ త్వరగా పూర్తిచేసి నివేదికను కలెక్టరేట్‌ కు పంపాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల సహాకారంతో ఎక్కడా ఆరోపణలు లేకుండా అందరి సహకారంతో మెరుగైన ఓటర్ల జాబితాను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. సర్వే జరుగుతున్న క్రమంలో రాజకీయ పార్టీలకు చెందిన పోలింగ్‌ బూత్‌ లెవల్‌ ఎజెంట్ల సమక్షంలో వచ్చే ఇబ్బందులను అధిగమించాలని సూచించారు. ఓటర్ల జాబితా లో మార్పులు, చేర్పులు, చనిపోయినవారి పేర్లను తొలగించడం, కొత్త ఓటర్ల ను చేర్చడంలో ఎక్కడా ఆరోపణలు రావడానికి వీలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, జిల్లాకు చెందిన ఈ.ఆర్‌.ఓ లు, ఏ. ఏ.ఈ.ఆర్‌.ఓ లు, తదితరులు పాల్గొన్నారు.