- ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయకూడదు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:ప్రజా ప్రతినిధులపై నమోదైన తీవ్రమైన నేరాల (క్రిమినల్ కేసులు) విచారణలను వేగంగా పూర్తి చేసేందుకు కచ్ఛితమైన, ఏకరీతి మార్గదర్శకాలు రూపొందించడం క్లిష్టమైన ప్రక్రియ అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను హైకోర్టులకు అప్పగించింది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపి, ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజా ప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసులను త్వరితగతిన విచారించాలని హైకోర్టులను ఆదేశించింది. పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన లేదా ప్రధాన న్యాయమూర్తి నియమించిన ధర్మాసనం ప్రత్యేక బెంచీలను ఏర్పాటు చేయాలని, కేసులను జాబితా చేయాలని పేర్కొంది. ఈ కేసులు ఏడాది లోపే పరిష్కరించాలని హైకోర్టులను ఆదేశించింది. క్రిమినల్ కేసుల సత్వర విచారణకు అవసరమైన పర్యవేక్షణ కోరుతూ సుమోటో కేసులు నమోదు చేయాలని హైకోర్టులను ధర్మాసనం ఆదేశించింది.
ట్రయల్ కోర్టులు అత్యవసరమైతే తప్ప ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణలు వాయిదా వేయకూడదని సుప్రీం ఆదేశాల్లో పేర్కొంది. కేసుల సత్వర పరిష్కారానికి వెబ్‌సైట్‌ను సిద్ధం చేయాలని ఆదేశించింది. కేసుల వివరాలను జిల్లా, ప్రత్యేక న్యాయస్థానాల నుంచి సేకరించి హైకోర్టు వెబ్‌సైట్‌లో ప్రత్యేక ట్యాబ్ ఏర్పాటు చేసి అందులో పొందుపరచాలని హైకోర్టులకు సూచించింది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతికతను జిల్లా న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. దోషిగా తేలిన ఎంపి, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై విచారణ జరుపుతామని, ఈ అంశంపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.