Nov 03,2023 12:36

ప్రజాశక్తి - చాపాడు (కడప) : ప్రజల నుంచి వచ్చిన సమస్యలలో అవకాశం ఉన్నవాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ విజయరామరాజు సూచించారు. శుక్రవారం చాపాడు ఎంపిడిఓ కార్యాలయంలో ఎంఎల్‌ఏ ఎస్‌.రఘురామిరెడ్డి తో కలిసి జగనన్న కు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ... ప్రతి సోమవారం సమస్యల పరిష్కారం కోసం కడపకు ప్రజలు రావాల్సిన అవసరం ఏర్పడుతుందని ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులే సచివాలయాలకు వెళ్లే ఏర్పాటు చేశామన్నారు. చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని అలాంటి వాటి పట్ల అశ్రద్ద చూపకుడదన్నారు. సచివాలయ సిబ్బంది పనితీరు, ఈకైవైసీ, జగనన్న ఆరోగ్య సురక్ష, ఎఎన్‌ఎం, మహిళా పోలీస్‌ సిబ్బంది పనితీరును అధికారులు పరిశీలించాలని అన్నారు. వాలంటీర్ల అటెండెన్స్‌ 68 శాతం మాత్రమే ఉందని సరిగా పనిచేయనివారిని తొలగించాలన్నారు. చియ్యపాడు, అయ్యవారిపల్లె, సోమాపురం నుంచి ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయన్నారు. ఎంఎల్‌ఏ ఎస్‌.రఘురామిరెడ్డి మాట్లాడుతూ ... ప్రజల నుంచి అందే సమస్యలను అధికారులు పరిశీలించాలన్నారు. కొంతమంది అభివఅద్ధిని అడ్డుకునేందుకు అర్జీలు పెడుతుంటారని వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల వద్దకే సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేసి గణేష్‌ కుమార్‌, ఆర్డీఓ శ్రీనివాసులు, జిల్లా స్థాయి అధికారులు, ఎంపిపి టి.లక్షుమయ్య, తహశీల్దార్‌ యామిని, ఎంపిడిఓ శ్రీధర్‌ నాయుడు, ప్రజలు పాల్గొన్నారు.