విజయనగరం : విజయనగరం రైలు ప్రమాదంలో దాదాపు 100మంది గాయపడ్డారు. జిల్లా సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ క్షతగాత్రులకు అందుతున్న వైద్య సహాయ చర్యలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ... మృతి చెందిన 13 మందిలో ఇప్పటివరకు 11 మృత దేహాలను గుర్తించామన్నారు. మృతులకు చెందిన కుటుంబాలు ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షలు వరకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. క్షతగాత్రులకు రూ.2 లక్షలు వరకు పరిహారం అందుతుందన్నారు. జిల్లా సర్వజన ఆసుపత్రిలో 38 మందికి చికిత్స అందుతుందని తెలిపారు. విశాఖ కేజీహెచ్, ఎన్.ఆర్.ఐ., మెడికవర్ ఆసుపత్రిలో ఒక్కొక్కరు చొప్పన వైద్య చికిత్స అందిస్తున్నారని అన్నారు. వైద్య సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. మృత దేహాలకు పోస్టు మార్టం నిర్వహించి, బంధువులకు అప్పగిస్తామని తెలిపారు.