Aug 16,2023 17:20

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్య) : అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి ముంపుకు గురైన పులపుత్తూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీశా పిఎస్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పులపుత్తూరు గ్రామంలో ఆయన పర్యటించి ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. రహదారులు, నీరు, విద్యుత్తు వంటి మౌలిక వసతుల ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఆయా శాఖల అధికారులతో వసతుల ఏర్పాట్లు, నిర్మాణాల గురించి చర్చించారు. నెలకు రెండు నుంచి మూడుసార్లు గ్రామాన్ని సందర్శించేందుకు వస్తానని, నిర్మాణాల కల్పనలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఇళ్ల నిర్మాణాలతో పాటు కాలనీలో మౌలిక వసతుల కల్పనలో ఏమాత్రం జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఆర్డీవో రామకృష్ణారెడ్డి, గృహ నిర్మాణ శాఖ డి.ఈ మురళి, తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యం రెడ్డి, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారిణి ఫణి రాజకుమారి, ఆర్‌.డబ్ల్యూ.ఎస్‌, పంచాయితీ రాజ్‌, విద్యుత్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.